ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా పాలనలో దళితులపై.. దాడులు, వేధింపులు, అత్యాచారాలు ఎన్నో... - ap crime news

రాష్ట్రంలో వైకాపా అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికార పార్టీ ఆగడాలకు బడుగులు బలవుతూనే ఉన్నారు. మూడేళ్లుగా ఎస్సీలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అరాచకాలకు ఎంతోమంది ఎస్సీలు ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది బాధితులుగా మిగిలిపోయారు. కాకినాడలో వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబు అరాచకానికి బలైన పూర్వ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం ఘటనతో.. ఎస్సీలపై దాడుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

వైకాపా
వైకాపా

By

Published : May 24, 2022, 5:17 AM IST

రాష్ట్రంలో మూడేళ్లుగా దళితులపై దాడులు, వేధింపులు,అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి. తరచుగా రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో అరాచకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాన్ని, అధికార పార్టీ నేతలను ప్రశ్నించిన వారిపై.... దమనకాండ కొనసాగుతూనే ఉంది. వరుస దురాగతాలపై ఎస్సీ సంఘాలు, రాజకీయ పక్షాలు ఆందోళనలు చేస్తున్నా.... అరాచకాలు ఆగకపోగా అంతకంతకూ పెచ్చరిల్లుతున్నాయి.

వైకాపా పాలనలో దళితులపై.. దాడులు, వేధింపులు, అత్యాచారాలు ఎన్నో...

నర్సీపట్నానికి చెందిన డాక్టర్‌ సుధాకర్‌ ఘటన రాష్ట్రంలో దళితులపై దాడులకు పరాకాష్ట. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేసిన సుధాకర్‌... కరోనా మొదటి వేవ్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో మాస్కులు కూడా ఇవ్వడం లేదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. వైరస్‌ దెబ్బకు ప్రపంచమే వణికిపోతున్న సమయంలో ఎన్-95 మాస్కులు అడిగిన ఆయన్ను.. నిబంధనలకు విరుద్ధంగా మీడియాతో మాట్లాడారంటూ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటికి ఆ విషయం కొంత సద్దుమణిగినా... కొంత కాలం తర్వాత విశాఖ నగరంలో సుధాకర్‌ పట్ల పోలీసులు ప్రవర్తన కలకలం రేపింది. డాక్టర్ సుధాకర్‌ చొక్కా లాగేసి, రెండు చేతులూ వెనక్కి విరిచి నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లడం, కిందపడేసి దురుసుగా వ్యవహరించడం యావత్‌ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తర్వాత డాక్టర్‌ సుధాకర్‌ మానసికంగా స్థిమితంగా లేరంటూ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. తనకు ఎలాంటి మానసిక సమస్యలు లేవని ఆయన మొత్తుకున్నా పట్టించుకున్నవారు లేరు. ఆసుపత్రిలో తనపట్ల వ్యవహరిస్తున్న తీరు, అవసరం లేని చికిత్స అందించి ఇబ్బంది పెట్టడంపై సూపరింటెండెంట్‌కు సుధాకర్‌ లేఖ రాశారు. అనంతర కాలంలో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం... మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ విచారణ జరుగుతుండాగానే గుండెపోటుతో డాక్టర్‌ సుధాకర్‌ మృతి చెందారు. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ జరిగినా.... ప్రభుత్వ వేధింపులు ఆగకపోవడంతో సుధాకర్‌ మానసికంగా కుంగిపోయారని ఆయన తల్లి ఆవేదన వ్యక్తంచేశారు. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు అనితారాణిపై వైకాపా నాయకుల దౌర్జన్యం సంచలనం సృష్టించింది. 2020 మార్చి 22న ఓ బాలుడికి గాయమైందంటూ కొందరు ఆసుపత్రికి రాగా... కరోనా కేసులకు మాత్రమే వైద్యం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. దీనిపై తనను దుర్భాషలాడారని డాక్టర్ అనితారాణి ఆరోపించారు. అదే రోజు పెనుమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. రాజకీయ పలుకుబడితో పెనుమూరు పీహెచ్​సీ నుంచి చిత్తూరు టీబీ ఆసుపత్రికి బదిలీ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన చెందారు. ఆమె ఆవేదనకు సంబంధించిన ఫోన్‌ కాల్ సామాజిక మాధ్యాల్లో వైరల్ అయింది.

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట బులుసుపేటకు చెందిన ఎస్సీ యువకుడు అలపు గిరీష్‌బాబు... గతేడాది మున్సిపల్‌ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మాకు వ్యతిరేకంగా పోటీ చేస్తావా అని కక్ష పెంచుకున్న వైకాపా నాయకులు.. తప్పుడు ఫిర్యాదుతో కేసు పెట్టించారు. పోలీసుల వేధింపులు భరించలేక ఈ ఏడాది జనవరి 5న గిరీష్‌ బలవన్మరణానికి పాల్పడ్డారు. వైకాపా నాయకుల ఒత్తిడితో రోజూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హింసించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని గిరీష్‌ సోదరుడు ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. మృతదేహాన్ని సామర్లకోట పోలీసుస్టేషన్‌ మెట్లపై ఉంచి ఆందోళన చేశారు.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన దళిత యువకుడు ఇండుగుమిల్లి ప్రసాద్‌కు.... పోలీస్‌ స్టేషన్‌లోనే శిరోముండనం చేయడం చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇసుక రేవుల్లో అధికార పార్టీ నాయకుల దందాపై నిలదీయడమే నేరమైందని... పోలీసులతో కలిసి చిత్రహింసలు పెట్టడంతోపాటు గుండు గీయించి తీవ్రంగా అవమానించారని బాధిత కుటుంబం తెలిపింది. స్థానిక వైకాపా నాయకుడు కవల కృష్ణమూర్తి, ఎస్‌ఐ ఫిరోజ్‌ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పింది. శిరోముండనంపై తీవ్రంగా కలత చెందిన ప్రసాద్..నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా రాష్ట్రపతికి లేఖ రాశారు. తనకు న్యాయం జరగకపోతే నక్సలైట్లలో చేరాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై వెంటనే స్పందించిన రాష్ట్రపతి కోవింద్... తగిన చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అనంతర కాలంలో ఎస్‌ఐని సస్పెండ్‌ చేసినా, అసలు కారకులపై మాత్రం ఎలాంటి చర్యలూ లేవు.

బాపట్ల జిల్లా చీరాలకు చెందిన దళిత యువకుడు కిరణ్‌.... కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మాస్కు పెట్టుకోలేదంటూ పోలీసులు కొట్టడంతో చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపించారు.
మాస్కు పెట్టుకోలేదని జీపులో తీసుకెళ్లిన పోలీసులు.... ఆ తర్వాత కిరణ్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయని, అపస్మారక స్థితిలో ఉన్నాడని సమాచారం ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. తొలుత స్థానిక ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ కిరణ్ చనిపోయారు. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే కిరణ్‌ మరణించాడని కుటుంబ సభ్యులు వాపోయారు. పోలీసులు మాత్రం భిన్నమైన వాదన వినిపించారు. జీపులో తీసుకెళుతుండా కిరణ్ దూకేయడం వల్లే గాయాలై, ఆ తర్వాత చనిపోయినట్లు చెప్పారు.

నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు, ఆఫ్కాప్‌ ఛైర్మన్‌ కె.అనిల్‌బాబుపై... అత్యాచార ఆరోపణలు వచ్చాయి. తన కుమార్తెపై అనిల్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డారంటూ... గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎస్సీ బాలిక తండ్రి ఎస్సీ కమిషన్‌కు మార్చి 26న ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లా పేరేచర్లకు చెందిన పొలిచర్ల కిరణ్‌కుమార్‌ మే 2వ తేదీన హత్యకు గురయ్యారు. స్థానికంగా స్పిన్నింగ్ మిల్‌లో కార్మికుడిగా పనిచేసే కిరణ్‌కుమార్‌... డోకిపర్రు మైనింగ్ ప్రాంతంలో శవమై తేలాడు. ఏప్రిల్ 22వ తేదీ నుంచే కిరణ్‌కుమార్‌ కనిపించకుండా పోయారు. వైకాపా జేడ్పీటీసీ సిద్ధయ్య, ఆయన బావమరిది హత్యకు పాల్పడ్డారని... కిరణ్ తండ్రి శివరాజ్ ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని... సిద్ధయ్యతో కుమ్మక్కై కేసును నీరుగార్చారని ఆరోపించారు.

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలకు చెందిన తెలుగుదేశం కార్యకర్త, దళిత నాయకుడు కాకాని ఏసురాజుపై... ఈ నెల 8న కంట్లో కారం చల్లి, ఇనుప రాడ్లతో దాడి చేశారు. వైకాపా నాయకుడు, రొంపిచర్ల ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, వాలంటీర్లు గోపాల్, నాగరాజు హత్యాయత్నం చేశారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు.

తెలుగుదేశం సానుభూతిపరులు కావడంతో వైకాపా నాయకుల ఒత్తిడికి తలొగ్గి తమ ఇంటిని కూల్చేశారంటూ... అనంతపురం జిల్లా కుందుర్పి మండలం నిజవల్లికి చెందిన దళితులు హనుమంత రాయుడు, అనితాలక్ష్మి దంపతులు ఈ నెల 7న ఆత్మహత్యకు యత్నించారు. ఆ తర్వాత వారిని ఆసుపత్రిక తరలించి చికిత్స అందించడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు అధికార పార్టీ నేతలు తనపై దాడి చేశారని... గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన దళిత మహిళ వెంకాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన దుస్తులు చించేశారని వాపోయారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ జరిపి కేసు నమోదు విషయం పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. కానీ తాడికొండ వాలంటీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకాయమ్మపై మాత్రం పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన దళిత రైతులపై పోలీసులు అట్రాసిటీ కేసులు పెట్టడం... తీవ్ర విమర్శలు దారితీసింది. మూడు రాజధానుల పేరిట ఆందోళన చేస్తున్నవారి శిబిరానికి వాహనాల్లో జనాన్ని తరలిస్తుండగా... అమరావతి రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీనిపై అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెంకు చెందిన ఎస్సీ రైతులపైనే పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టారు. సంకెళ్లు వేసి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించగా... పోలీసుల తీరును కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడమేంటని ప్రశ్నించింది.

ఇదీ చదవండి:'ఇషా గుప్తా' స్కిన్​ షో చూస్తే.. నిషా ఎక్కాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details