పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తలకు దారి తీసిన తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంట సర్పంచ్ నామినేషన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. భార్య పుష్పవతిని సర్పంచ్ పదవికి పోటీకి నిలబెడుతున్నారనే కారణంతో.. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు అపహరించారు. తాళ్లతో కట్టి అటవీ ప్రాంతంలో పడేశారు. శ్రీనివాసరెడ్డిని గమనించిన పశువుల కాపరులు ఆయనను రక్షించారు. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి తన భార్య పుష్పవతితో.. నామినేషన్ వేయించారు. జగ్గంపేట పోలీసుల విచారణలో గొల్లలగుంట గ్రామానికి చెందిన ముగ్గురిపై అనుమానం ఉందని చెప్పారు. సోమవారం ఉదయం జగ్గంపేట సీఐ సురేష్‌బాబు, ఎస్సై రామకృష్ణ... శ్రీనివాసరెడ్డిని తీసుకెళ్లి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంతలో ఏం జరిగిందో కానీ సాయంత్రం ఐదు గంటల సమయంలో పొలంలోని చెట్టుకు వేలాడుతూ శ్రీనివాసరెడ్డి మృతదేహం కనిపించింది.
వైకాపా హత్యే: చంద్రబాబు
శ్రీనివాసరెడ్డిని కిడ్నాప్ చేయటంతో పాటు, హత్యచేసి చెట్టుకు వేలాడ దీయడం.. వైకాపా ఉన్మాద, కిరాతక చర్యలకు నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కిడ్నాపర్ల చెరనుంచి శ్రీనివాసరెడ్డి బయటపడి, మీడియాతో మాట్లాడిన కొన్ని గంటలకే హత్యకు గురికావడం....రాష్ట్రంలో నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థకు అద్దం పడుతోందని ఆక్షేపించారు. పోలీసుల్లో కొందరు వైకాపా నేతలతో కుమ్మక్కైయ్యారన్న చంద్రబాబు.. శ్రీనివాసరెడ్డిది వైకాపా ప్రభుత్వ హత్యేనన్నారు. శ్రీనివాసరెడ్డి హంతకులను తక్షణమే అరెస్ట్ చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను కఠినంగా శిక్షించాలన్న చంద్రబాబు....మళ్లీ ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని తెలుగుదేశం సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. పోలీసులపైనే అనుమానాలు ఉన్నాయన్న ఆయన.. వారే దీనికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
నేడు లోకేశ్ రాక...
శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్....మంగళవారం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గొల్లలగుంటకు చేరుకోనున్న ఆయన.. శ్రీనివాసరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
ఇదీచదవండి
గొల్లలగుంటలో సర్పంచ్ అభ్యర్థికి బెదిరింపులు... భర్త అపహరణ