prabhala theertham in godavari districts: తూర్పుగోదావరి జిల్లాలో ప్రభల తీర్థం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రభల తీర్థం వేడుకను శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన ప్రభలను స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేలాదిగా జనం..
తీర్థ మహోత్సవాన్ని వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. దీంతో కొత్తపేట జనసంద్రంగా మారింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి. ప్రభల తీర్థంలో రాత్రంతా బాణసంచా కాల్చడం ఆనవాయితీ. ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించారు. కొత్తపేట బోడిపాలెం వంతెన వద్ద నుంచి వాహనాలను గ్రామంలోకి రానీయకుండా దారి మళ్లించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టారు.