Sankrati Festival: సంక్రాంతి సందడి మొదలైంది. మకర సంక్రమణ వేళ వచ్చే తొలి పండుగే భోగి. ఇక్కడితో సంక్రాంతి సందడి మొదలు. పాత పోయి కొత్త తెచ్చే పండుగ ఇది. సంక్రాంతి రైతు పండుగైతే.. భోగి ఆటపాటల పండుగ. కొత్త సమయం, కొత్త పంట.. చలిని తరిమి నులి వెచ్చదనాన్ని తెచ్చే పండుగే భోగి.
సంక్రాంతి పండుగకు దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రాధాన్యం ఉంది. ప్రాంతాల వారీగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పండుగ... వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్కృతీ సంప్రదాయాల ఆధారంగా జరుపుకొంటారు. భౌగోళిక సరిహద్దుల్ని బట్టి ఈ రీతులు మారుతుంటాయి. పాడి పంటలకు సంబంధించిన పండుగ కాబట్టి.. ప్రతిచోటా ప్రధానంగా కనిపించే అంశాలు భోగి మంటలు, పిండి వంటలు. పండుగ వేళ చేసుకునే సంబరాలు ఆనందాన్ని రెట్టింపు చేస్తే... ప్రాంతాల వారీగా జరిగే పందేలు ఎక్కడో మూలన దాక్కున్న పౌరుషాల్ని తట్టి లేపుతుంటాయి.
సంక్రాంతి సందడికి అసలు సిసలు చిరునామా మన పల్లెటూళ్లే. బతుకుదెరువుకు ఎంత సుదూర ప్రాంతాలకు వెళ్లినా... సొంతూరుని వెతుక్కుంటూ రావడం ఆనవాయితీ. పిల్లా-పెద్ద, పేద-ధనిక తేడా లేకుండా ఉత్సాహంగా జరుపుకొనే అపురూపమైన తెలుగింటి పండుగ. భోగి మంటలు, గొబ్బెమ్మలతో అలరించిన రంగవల్లులు... కొత్త దుస్తులు.. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు... పౌరుషానికి ప్రతీకలైన కోడిపందేలు... గంగి రెద్దుల విన్యాసాలు, స్వాగతం చెప్పే పచ్చటి పంటలు... పొలం గట్లపై పైరు గాలి పీలుస్తూ చిలిపిగా తిరిగిన చిన్ననాటి స్మృతుల్ని గుర్తుచేసుకునే క్షణాలు.. ఇలా ఎంత చెప్పినా తనివితీరదు.