కోస మాంసం వెల కాసు బంగారం ధరతో సమానంగా పలికింది. సంక్రాంతి బరుల్లో ఎన్నో కోళ్లను నేలకూల్చాక ప్రత్యర్థి పుంజుతో తలపడి చనిపోయిన కోడి పుంజు మాంసమే కోస. పందేల కోసం పెంచే కోళ్లకు జీడిపప్పు, బాదంపప్పు వంటి బలవర్థకమైన ఆహారాన్ని అందించడంతోపాటు శ్రద్ధగా ఏడాదిపాటు పెంచుతారు. అది కనీసం 4 నుంచి 6 కిలోల బరువుంటుంది. అది నేలకొరిగాక కోస ధర చాలాచోట్ల రూ.20 వేల నుంచి 30 వేలకు పలికింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జోరుగా జరిగిన కోడి పందేల్లో.. కోస కోసం చాలా మంది ఆరాటపడ్డారు. వేలాదిగా ఖర్చు చేసి మరీ.. కోసను సొంతం చేసుకుని ఆనందపడ్డారు.
జోరుగా పందేలు
సంక్రాంతి సందర్భంగా ఉభయగోదావరి జిల్లాలలో కోడి పందేలు జోరుగా సాగాయి. పందేలను తిలకించడానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురితో పాటు తెలంగాణ, తమిళనాడు నుంచి కూడా భారీగా తరలివచ్చారు. ప్రధాన బరుల్లో కోడిపందేలు, గుండాట, పేకాటకు రూ.కోట్లలో చేతులు మారాయి. తూర్పుగోదావరి జిల్లాలో చిన్నాపెద్ద కలిపి 500కుపైగా బరులను ఏర్పాటుచేశారు. కోనసీమలోని ఐ.పోలవరం మండలం కేశనకుర్రుపాలెం వద్ద ఏర్పాటుచేసిన బరిలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో కోడిపందేలను నిర్వహించారు. అల్లవరం మండలం గోడి, అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో బరుల వద్ద ఘర్షణల్లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.