తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు సంచార సంజీవని బస్సు వస్తుందని అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికులు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. సుమారు రెండు వందల మంది చేరుకోగా... మెుదటగా 74 మందికి రిజిస్ట్రేషన్ చేయించి... పరీక్షలు మెుదలుపెట్టారు. అంతలోనే ఉన్నతాధికారులు పరీక్షలు ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారనీ... కొవిడ్ నిర్థరణ పరీక్షలు అర్థంతరంగా ఆపేశారు.
సంజీవని బస్సులో పరీక్షలన్నారు... రిజిస్ట్రేషన్‌తో సరిపెట్టారు - కొత్తపేటలో ఆగిన కరోనా పరీక్షలు
కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు... ప్రజలంతా పరీక్షల కోసం బారులు తీరారు... రిజిస్ట్రేషన్లు మెుదలుపెట్టారు. ఇంతలో ఏమయ్యిందో ఏమో కొవిడ్ పరీక్షలు ఆపేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల కోసం వేచిచూసిన ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో జరిగింది.

కరోనా పరీక్షలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావటంతో...స్థానిక అధికారులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. స్వాబ్ టెస్టులు చేసేందుకు కిట్లు పంపిస్తున్నామనీ... వాటితోనే పరీక్షలు నిర్వహించాలనీ ఉన్నతాధికారులు చెప్పటంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంజీవని బస్‌లో నిర్వహించే పరీక్షల ద్వారా 15 నిమిషాల్లో ఫలితాలు వస్తుండగా... స్వాబ్ ద్వారా నిర్వహించే పరీక్షల ద్వారా ఫలితాలు రావటానికి సుమారు రెండు రోజుల సమయం పడుతుంది.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్ : తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఆదివారం కర్ప్యూ