రైతు భరోసా పథకం అమల్లో ఎదురవుతున్న సమస్యలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా సమస్యలపై వినతులు స్వీకరించింది. ఇందుకోసం ప్రత్యేక స్పందన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. రైతులు తమ మొర వినిపించేందుకు తహసీల్దార్ కార్యాలయాలకు బారులు తీరారు.
శ్రీకాకుళం జిల్లాలో..
రైతు భరోసా అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ నివాస్ స్పష్టం చేశారు. ఈ నెల 15లోగా లబ్ధిదారులందరూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
విజయనగరం జిల్లాలో
సాలూరు నియోజకవర్గం పరిధిలో పాచిపెంట, మక్కువ, సాలూరు మెంటాడ మండలాల్లో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, అగ్రికల్చర్ శాఖ కలిపి రైతు భరోసా స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. గిరిశిఖర గ్రామాల నుంచి కూడా గిరిజనులు తరలివచ్చి తమ ఫిర్యాదులు అధికారులకు అందజేశారు.
విశాఖ జిల్లాలో
రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయాలకు క్యూ కట్టారు. రైతు భరోసా అందని రైతులు తమ ధ్రువపత్రాలతో అధికారులకు ఫిర్యాదులు చేశారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలో
రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం, కోరుకొండ మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు భరోసాపై స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయానికి వచ్చిన రైతులు తమ ఫిర్యాదులను అధికారులకు అందించారు. ఆధార్లో తప్పులు, పట్టా ఆన్లైన్లో కాకపోయినా, చనిపోయిన వారి పేరున డబ్బులు పడినా, ఒకరికి బదులు వేరొకరికి నగదు జమ అయినా.. ఇలాంటి ఫిర్యాదులు చేయవచ్చని అధికారులు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లో స్పందన కార్యక్రమాలు నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో
ఆచంట తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో రైతు భరోసాపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.... ప్రతి దరఖాస్తునూ పరిశీలించి అర్హులందరికీ న్యాయం చేస్తామన్నారు. మోపిదేవి మండల తహశీల్దార్ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన రైతులు... తమ సమస్యలు పరిష్కరించాలని అర్జీలు పెట్టుకున్నారు.