కరోనా రెండో దశ ఉద్ధృతి, పాక్షిక కర్ఫ్యూ అమలు తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఓ పక్క ప్రజా రవాణా ద్వారా వచ్చే రాబడి బాగా పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో వస్తు, సరకు రవాణా ద్వారా ఆదాయార్జనే ప్రత్యామ్నాయంగా కనిపించడంతో దీనిపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. జిల్లా ఆర్టీసీకి కార్గో పార్సిల్ రవాణా సేవల ద్వారా రోజూ రూ.4 లక్షల నుంచి రూ.4.50 లక్షల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం దూరప్రాంతాలకు బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడంతోపాటు జిల్లా పరిధిలో తిరిగే సర్వీసులు తగ్గిపోవడంతో పార్సిల్ రవాణా ఆదాయం కూడా పడిపోయింది. కర్ఫ్యూ అమలు జరుగుతున్నప్పట్నుంచి కార్గో రవాణా సేవల ద్వారా రోజుకు రూ.2 లక్షల్లోపే రాబడి వస్తోంది.
జిల్లాలోని తొమ్మిది డిపోల్లో కలిపి మొత్తం 25 డీజీటీ(డిపో గూడ్స్ ట్రాన్స్‌పోర్టు) వాహనాలు ఉండగా ప్రస్తుతం వీటి ద్వారానే వస్తు, సరకు రవాణా జరుగుతోంది. ప్రతిరోజూ సాయంత్రం 6గంటలకు రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు, మధ్యాహ్నం 12గంటలకు విశాఖపట్నం, 2 గంటలకు విజయవాడ, గుంటూరుకు కార్గో డీజీటీల్లో సరకు తరలిస్తున్నారు. ఇదికాక ఆయా డిపోల్లోని డీజీటీల ద్వారా పది టన్నుల వరకు బల్క్‌గా వివిధ సరకు రవాణా చేయడం ద్వారానే ఎక్కువ ఆదాయం సాధించేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. డీజీటీల్లో సరకు రవాణా ద్వారా 15 రోజుల్లో జిల్లా ఆర్టీసీకి రూ.37.54లక్షలు సమకూరగా, దీనిలో బల్క్‌గా సరకు రవాణా ద్వారా రూ.13.67లక్షలు వచ్చినట్లు ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్(కమర్షియల్) రమేష్ తెలిపారు.