ఇసుక రీచ్‌లకు అనుమతించిన జియో కోఆర్డినేట్లను అతిక్రమించి అక్రమ తవ్వకాలకు తెగబడిన నలుగురు గుత్తేదారులకు రూ.22,50,87,000 అపరాధ రుసుము విధిస్తూ.. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలోని శాండ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఒక జిల్లా శాండ్ కమిటీ ఇంత మొత్తంలో జరిమానా విధించడం రాష్ట్రంలోనే ఇది తొలిసారి అని అధికారులు పేర్కొన్నారు. ఈనెల 23న సమావేశంలో తీసుకున్న నిర్ణయ వివరాలను సంయుక్త కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం వివరించారు. అనుమతించిన చోట కాకుండా మరో ప్రదేశంలో తవ్వకాలు చేసిన ఇసుక విలువకు అయిదు రెట్ల అపరాధ రుసుమును (జీవో ఎంఎస్ నంబరు 71 సబ్‌రూల్ 16డి/ రూల్ 9బీ ప్రకారం) విధించామని వెల్లడించారు. వారం కిందట జిల్లా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో దాడులు చేసిన క్రమంలో అక్రమాలు వెలుగు చూశాయి. ఈ దాడుల్లో భారీ యంత్రాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసిన గుత్తేదారు, విధించిన అపరాధ రుసుం వివరాలు..
* గుత్తేదారు సయ్యద్ రబ్బానీ కపిలేశ్వరపురం మండలంలోని తాతపూడి గ్రామం వద్ద అక్రమ తవ్వకాలతో 53 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తరలించారని తేల్చి రూ.10.68 కోట్ల అపరాధ రుసుము విధించారు.
* మల్లిడి భూపతిరెడ్డి కపిలేశ్వరపురంలో 26 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అక్రమంగా తవ్వి, తరలించినట్లు అంచనాకు వచ్చి రూ.5.36 కోట్లు విధించింది.
* వోముల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆత్రేయపురం మండలం పులిదిండిలో 8,900 మె.టన్నుల ఇసుక నిల్వలు తవ్వినట్లు గుర్తించి రూ.1.79 కోట్ల జరిమానా విధించారు.
* కడియం మండలం వేమగిరిలో అనుమతులు ఒకచోట పొంది.. మరోచోట తవ్వేసిన రఘురామ్ హుమా పైప్స్ ఏజెన్సీపై ఎస్‌ఈబీ అధికారులు కేసు నమోదు చేశారు. 23 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అక్రమంగా తవ్వినట్లు గుర్తించి రూ.4.66 కోట్ల అపరాధ రుసుము విధించారు.
ఇసుక అక్రమార్కులకు 22.50 కోట్ల జరిమానా - fine imposed on sand miners news
ఇసుకాసురులపై తూర్పు గోదావరి జిల్లా శాండ్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇసుక అక్రమాలకు పాల్పడిన వారిపై భారీగా జరిమానా విధించింది.
ఇసుక అక్రమార్కులపై భారీ జరిమానా
ఇదీ చదవండి:గండేపల్లి సొసైటీ అక్రమాల్లో 19 మందిపై కేసు