తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణం గతుకుల మయంగా మారింది. మెట్ట ప్రాంత నియోజకవర్గాలైన ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజానగరం, పెద్దాపురం, తుని తదితర నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ, పంచాయతీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఏలేశ్వరం నుంచి జె.అన్నవరం వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసమైంది. పెద్దపెద్ద గోతులతో రహదారి అధ్వాన్నంగా తయారైంది. యర్రవరం నుంచి ఏలేశ్వరం రహదారి కూడా గతుకులమయంగా తయారైంది.
ప్రత్తిపాడు మండలంలోని ఒమ్మంగి నుంచి శంఖవరం వెళ్లే రహదారి ఏళ్ల తరబడి నిర్వహణ చేపట్టక పోవడంతో మట్టిరోడ్డుగా మారిపోయింది. శంఖవరం మండలం కత్తిపూడి నుంచి రౌతులపూడి వెళ్లే రహదారి గోతులతో రాళ్లు తేలి ఉన్నాయి. ఉత్తరకంచి నుంచి పెద్దిపాలెం వెళ్లే రహదారిదీ అదే దుస్థితి. తాజాగా కురిసిన వర్షాలకు రోడ్లు బురదమయంగా మారాయి. ద్విచక్రవాహనాలతోపాటు ఆటోల్లో ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు అంటున్నారు. గర్భిణులు, అనారోగ్యంతో ఆసుపత్రులకు ప్రయాణించే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందని వాహనదారులు చెబుతున్నారు.