రాజమండ్రి ప్రభుత్వ కార్మిక బీమా ఆసుపత్రి(ఈఎస్‌ఐ)లో శస్త్రచికిత్సలకు ఇబ్బందులు తొలగనున్నాయి. నాలుగున్నరేళ్ల కిందట మూతపడిన ఆపరేషన్ థియేటర్‌ను ఎట్టకేలకు ఇక్కడి వైద్యాధికారులు తిరిగి ప్రారంభించారు. ఇటీవల మరమ్మతులు పూర్తిచేసి ప్రారంభించిన ఇక్కడి డిస్పెన్సరీ భవనంలోని పై అంతస్తులో దీనిని ఏర్పాటు చేశారు. ఇక్కడి 50 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రిలో భవనాలు శిథిలావస్థకు చేరడంతో 2016లో ఆపరేషన్ థియేటర్ మూతపడింది. తర్వాత మూడేళ్ల కిందట శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన మరికొన్ని బ్లాకులను మూసివేశారు. అత్యావసర కేసులకు సంబంధించి కొద్దిమంది రోగులనే ఇక్కడ ఉంచి వైద్యసేవలందిస్తున్నప్పటికీ ఆపరేషన్ థియేటర్ మూతపడటంతో శస్త్రచికిత్సలు పూర్తిగా నిలిచిపోయాయి. రోగులను సాధారణ శస్త్రచికిత్సలకు కూడా బయటకు సిఫార్సు చేస్తున్నారు.
రాజమండ్రి ఈఎస్‌ఐలో ఆపరేషన్ థియేటర్ పునఃప్రారంభం - rajahmundry esi latest news
రాజమండ్రి ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కొన్నాళ్ల క్రితం మూతపడిన ఆపరేషన్ థియేటర్ పునఃప్రారంభమయ్యింది. ఇకపై శస్త్రచికిత్సలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. త్వరలో వంద పడకల ఆస్పతిగా మారనుందని వైద్యాధికారులు చెబుతున్నారు.
ఈఎస్‌ఐ రిఫరల్ ఆసుపత్రులు రాజమహేంద్రవరం పరిధిలో ఏడు ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు శస్త్రచికిత్సల నిమిత్తం 512 మంది రోగులను రిఫరల్ ఆసుపత్రులకు పంపించారు. వీరిలో 222 మందిని సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులకు సిఫార్సు చేశారు. సాధారణ శస్త్రచికిత్సలకు ఇబ్బందుల్లేకుండా ఇక్కడి ఆపరేషన్ థియేటర్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ఈఎస్‌ఐ వైద్యాధికారులు చొరవ చూపారు. మరమ్మతులు పూర్తయిన డిస్పెన్షరీ భవనంలో 30 పడకలు ఏర్పాటు చేయడంతోపాటు పైఅంతస్తులో థియేటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దాంతో ఆర్థోపెడిక్, ఇతర సాధారణ శస్త్రచికిత్సలు ఇక్కడే నిర్వహిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ బి.చిన్నహసన్ తెలిపారు. ప్రత్యేక వైద్యనిపుణుల పర్యవేక్షణలో చేయాల్సిన న్యూరో, గుండె, మూత్రపిండాలు తదితరాలకు శస్త్రచికిత్సలకు మాత్రమే రిఫర్ చేస్తున్నామన్నారు. త్వరలో ఇక్కడి ఈఎస్‌ఐ ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రిగా మారనున్నందున స్పెషలిస్టు పోస్టులుకూడా వచ్చి అన్ని శస్త్రచికిత్సలు ఇక్కడే జరుగుతాయని వైద్యాధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ప్రమాదవశాత్తు కాలువలో పడిన రైతు...రక్షించిన స్థానికులు