అవసరమైతే వైఎస్సార్ నగర్‌గా పేరు మార్చుకోండి కాని... రాజధానిని మాత్రం అక్కడే కొనసాగించాలని తెదేపా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ సీఎం జగన్‌కు సూచించారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో ప్రాంతీయ విబేధాలు సృష్టించొద్దని కోరారు. అమరావతిలో రాజధానికి ఆమోదం తెలిపి ఇప్పుడు మాట తప్పడం సరికాదని హితవుపలికారు. 'అమరావతి పేరు ఇష్టం లేకుంటే మీ తండ్రి పేరిట వైఎస్సార్ నగర్'గా పేరుమార్చుకొని అమరావతిని మాత్రం అక్కడే ఉంచాలని... ఒకటే రాజధానిగా ఉండాలని ఆయన సూచించారు.
రాజధాని కోసం గత ప్రభుత్వం సుమారుల 35వేల ఎకరాల భూమిని సేకరించిందని... అదనంగా మరో 20వేల ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడ ఉందని నెహ్రూ వివరించారు. రైతులకు, ఇతర అవసరాలకు పోను 11వేల ఎకరాల భూమి అక్కడ ఉందని దాంట్లో నచ్చినట్టుగా రాజధాని నిర్మాణం చేసుకోవాలని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ప్రతీవారు రాజధానిని మారిస్తే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరొస్తారని ప్రశ్నించారు. 5కోట్ల మంది ప్రజల ఆంక్షలు నెరవేర్చే దిశగా అమరావతిలో రాజధానిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.