కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో.. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని నర్సరీలో మెుక్కల ఎగుమతులు నిలిపివేయాలని తహసీల్దార్ ఆదేశించారు. ఈ మేరకు తహసీల్దార్ జవ్వాది వెంకటేశ్వరి, ఎంపీడీవో ఝాన్సీ నర్సీరీ రైతులతో సమావేశమయ్యారు.
ప్రస్తుతం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో.. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు, వాటి డ్రైవర్ల వలన పాజిటివ్ కేసులు మరింత అధికమయ్యే అవకాశం ఉండటంతో నర్సరీ మెుక్కల ఎగుమతులు రెండు వారాల పాటు నిలిపివేయాలని ఆదేశించారు
గత నాలుగు నెలలుగా మెుక్కల ఎగుమతులు పూర్తిగా ఆపేశామనీ.. ప్రస్తుతం సీజన్ కావటంతో మెుక్కల ఎగుమతులు రెండు వారాల నుంచే ప్రారంభించినట్లు రైతులు తెలిపారు. ఇప్పటికే తల్లి మెుక్క నుంచి అంట్లు వేరు చేశామనీ.. ఇటువంటి పరిస్థితుల్లో ఎగుమతులు ఆపితే భారీగా నష్టాలు వస్తాయని నర్సరీ రైతులు వాపోయారు. వేరుచేసిన మెుక్కలను ఎగుమతులు చేసి తదుపరి ఎగుమతులు పూర్తిగా ఆపేస్తామని.. ఇందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని రైతులు కోరారు. ప్రస్తుతం కడియం మండలంలో మొక్కల ఎగుమతులు తెలంగాణ రాష్ట్రానికి భారీగా జరుగుతున్నాయని వాటితో పాటే తమకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:రాజమహేంద్రవరంలో భారీ వర్షం... పొంగి పొర్లిన మురుగు నీరు