తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని రహదారులపై ప్రయాణమంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. అడుగడుగునా గోతులు, గుంతలతో అధ్వాన్నంగా మారిన రోడ్లపై ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రయాణిస్తున్నారు. కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం - అమలాపురం రహదారిపై వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. 37 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిని గుంతల మయంగా మారాయి. 5 నియోజకవర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం దీనిపైనే వెళ్తున్నా....ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజమహేంద్రవరంతో పాటు పశ్చిమ గోదావరి, విజయవాడ వైపు నుంచే వచ్చే వాహనాలు కోనసీమలోకి వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి. 2011లో రావులపాలెం - అమలాపురం మధ్య తారు వేశారు. అప్పటి నుంచి ఎవరూ పట్టించుకోలేదు. రహదారులను విస్తరించాలని మూడేళ్ల క్రితమే నిర్ణయించినా... నేటికీ పనులు చేపట్టలేదు. రోడ్లు వాన నీటితో నిండి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. తాత్కాలిక మరమ్మతుల పేరిట గోతుల్లో కంకర నింపి వాటిపై ఎర్ర మట్టి పోస్తున్నారు. ఈ కారణంగా... రోడ్లు బురదమయంగా మారి మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.