తూర్పుగోదావరి జిల్లాలో తెదేపా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. ఇంటింటికీ తిరుగుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. కాపుల సంక్షేమం కోసం తెదేపా అమలుచేస్తున్న పథకాలపై వైకాపా విషప్రచారం చేస్తోందని వంగవీటి రాధా మండిపడ్డారు. గొల్లప్రోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని.... పిఠాపురం వరకు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పిఠాపురం అభ్యర్థి వర్మకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాకినాడ తెదేపా ఎంపీ అభ్యర్ధి చెలమలశెట్టి సునీల్, ఎమ్మెల్యే అభ్యర్ధి వరుపుల రాజా శంఖవరంలో విస్తృత ప్రచారం చేశారు. వజ్రకూటం, వేలంగి, పెదమల్లాపురం, కొత్తూరు, మల్లాపురం గ్రామాల్లో పర్యటిస్తూ... ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
రాజమహేంద్రవరం వైకాపా ఎంపీ అభ్యర్ధి మార్గాని భరత్, నగర ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుతో కలిసి నగరంలో విస్తృత ప్రచారం చేశారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్ జగన్ నవరత్నాలను వివరిస్తూ... ఇంటింటికీ తిరుగుతున్నారు. రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తమ గెలుపు ఖాయమని రౌతు ఆశాభావం వ్యక్తం చేశారు.