రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ వర్షం పడింది. సాయంత్రం గంటపాటు కురిసిన వానతో... రహదారులు జలమయం అయ్యాయి. చాలాచోట్ల మోకాళ్ల లోతు నీళ్లుచేరి.. రాకపోకలకు ఆటంకం కలిగింది. లోతట్టు ప్రాంతాలైన ఎల్బీ వీధి, పెద్ద మార్కెట్, కంచిగారి వీధి, బోయగెరి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారు.
రుతుపవనాల రాకతో వర్షాలు... అక్కడక్కడా ప్రజల ఇబ్బందులు - rains
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం చల్లబడింది. ఎండలతో అల్లాడిన రాష్ట్ర ప్రజలను చినుకులు పలకరిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జోరు వానలు కురవగా... మరికొన్ని చోట్ల మోస్తరు చినుకులు పడ్డాయి. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.
తడిసిన తూర్పుగోదావరి
తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గాల్లో భారీ వర్షం పడింది. వర్షం తీవ్రతకు పెద్దాపురం వీధులు చెరువులను తలపించాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి, శరభవరం మధ్యనున్న పెద్దగడ్డవాగు ఉప్పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులో పడిన ద్విచక్ర వాహనాన్ని స్థానికులు సాహసించి బయటకు తీశారు. ప్రత్తిపాడు అగ్నిమాపక కేంద్రం వద్ద నీరు నిలిచిపోయింది. జిల్లాలోని ఏలేశ్వరం మండలాన్ని వర్షం ముంచెత్తింది. అయితే సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేక పల్లపు ప్రాంతాలు నీటమునిగాయి. గొల్లప్రోలులో వర్షం హోరెత్తింది. జోరు వానకు జగ్గంపేటలో రోడ్లపై భారీగా నీరు చేరింది.
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మోస్తరు వర్షం కురిసింది. భానుడి భగభగలతో ఇటీవల వరకు అల్లాడిన ప్రజలు... వాన రాకతో ఉపశమనం పొందారు.