Rains in AP: రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడలో భారీ వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ ముంపు బారిన పడింది. రైల్వే స్టేషన్ పట్టాలపైనా వరద పొంగింది. నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు కలెక్టరేట్ వాన నీరు ముంచెత్తింది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా మారి.. మురుగు నీరు ఇళ్లలోకి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వానలకు చెరువులు నిండాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పంటలు దెబ్బతిన్నాయి. మరిన్ని కొన్ని రోజులు వానలు పడే అవకాశముందన్న అధికారుల హెచ్చరికలతో జనం ఆందోళన చెందుతున్నారు.
ఎగువన కురిసిన వర్షాలతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా నదిలోకి భారీగా నీటిని వదిలారు. చల్లపల్లి మండలం అముదార్లంకలో సుమారు 20 నివాస గృహాలు నీటమునిగాయి, అధికారులు వరద సమాచారం ఇవ్వకపోవడం వల్ల.. సామాన్లు నీట మునిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అవనిగడ్డ మండలం పాత ఎడ్లలంకకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో వాణిజ్య పంటలను వరద దెబ్బతీసింది. పసుపు, అరటి, కూరగాయలు, పూల తోటలు దెబ్బతిన్నాయి. బాపట్ల జిల్లా వేటపాలెం, చినగంజాంలో కురిసిన వానకు రోడ్లు జలమయమయ్యాయి. కారంచేడు మండలం దగ్గుబాడు వద్ద వాగు పొంగి రాకపోకలకు అంతరాయం కలిగింది.