ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాయుగుండం ప్రభావం..ఉగ్రరూపం దాల్చిన ఉప్పాడ తీరం - news on rains at east godavvari

తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాయుగుండం ప్రభావంతో ఉప్పాడ తీరం ఉగ్రరూపం దాల్చింది. గృహాలు కోతకు గురయ్యాయి.

rains at east godavari
ఉగ్రరూపం దాల్చిన తీరం

By

Published : Oct 13, 2020, 1:11 PM IST

వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి జోరుగా వానలు పడుతున్నాయి. కోనసీమ ప్రాంతంలో, కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఉప్పాడ తీరంపై వాయుగుండం ప్రభావం చూపుతోంది. సముద్రం ఉగ్రరూపం దాల్చి రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. తీర ప్రాంత గ్రామాలు కోతకు గురయ్యాయి. పదుల సంఖ్యలో గృహాలు నేలకూలాయి. గృహాలు కోల్పోయిన బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. భారీ గాలుల ప్రభావానికి పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.

ఉగ్రరూపం దాల్చిన తీరం

తూర్పుగోదావరి జిల్లా తునిలో తాండవ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో కోటనందూరు - కొట్టాం, తుని - కొలిమేరు తదితర రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దీనితో రాకపోకలు నిలిచిపోయాయి. రెల్లిపేటలో కొన్ని పూరిళ్లు నేలమట్టమై.. నదిలో కలిసిపోయాయి. అనేకమంది నిరాశ్రయులయ్యారు. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు.

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ పూర్తిగా నీట మునిగింది. దీనితో జాతీయ రహదారిపైనే బస్సులను నిలిపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు.

లోతట్టు ప్రాంతం జలమయం

జగ్గంపేట ఎస్సీ కాలనీని నీరు చుట్టుముట్టింది. స్థానిక చెరువులు పొంగి ప్రవహిస్తుండటంతో కాలనీలోకి నీరు చేరింది. తహసీల్దార్ సరస్వతి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కాలనీ వాసులు దైర్యంగా ఉండాలి సూచించారు.

ఇదీ చదవండి: నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిన తీవ్రవాయుగుండం

ABOUT THE AUTHOR

...view details