తూర్పుగోదావరి జిల్లాలో రైతుల సాగునీటి కల సాకారం చేయాల్సిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఇప్పట్లో మోక్షం దక్కే సూచనలు కనిపించడం లేదు. ఓవైపు కొందరు రైతులు తమకు ఇచ్చిన పరిహారం చాలదని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే.. మరికొందరు జాతీయ హరిత త్రిసభ్య ధర్మాసనం (ఎన్జీటీ)ని ఆశ్రయించడంతో అందుబాటులోకి వచ్చిందనుకున్న పథకం అందకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పునః సమీక్షకు ఎన్జీటీ విముఖత చూపడంతో ప్రాజెక్టుకు ఇప్పట్లో మోక్షం కలిగే సూచనలు కనిపించడంలేదు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు లేకుండా ప్రాజెక్టు ఎలా నిర్మించారని గతంలోనే అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.
సీతానగరం మండలంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని రూ.1,638 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2017 జనవరి 5న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పిఠాపురంలో శంకుస్థాపన చేశారు. అదే ఏడాది ఆగస్టు 15న ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చారు. మొదటి దశలో పురుషోత్తపట్నంలో ఒక పంపు హౌస్.. రెండో దశలో రామవరం వద్ద మరో పంపు హౌస్ ఏర్పాటు చేశారు. ఈ రెండు మోటార్ల ద్వారా 1.5 టీఎంసీల గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి వదిలారు. ఏలేశ్వరం, కిర్లంపూడి, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో 67,614 ఎకరాలను ఏలేరు ఆయకట్టు కింద స్థిరీకరణకు ప్రతిపాదించారు.
కీలక పథకంతో మెలిక..
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ మౌలిక వసతులను ఉపయోగించుకుని పోలవరం ఎడమ ప్రధాన కాలువ 0.00 కి.మీ నుంచి 57.885 కి.మీ వరకు ఆయకట్టు భూములకు, ఏలేరు జలాశయం కింద ఆయకట్టు భూములకు వెరసి 2.15 లక్షల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం. దీనికితోడు విశాఖపట్నం నగర పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు నీరందించేలా అప్పట్లో ఈ పథకాన్ని రూపొందించారు. పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం కావడంతో ప్రత్యేక అనుమతులు తీసుకోలేదని గతంలో ప్రభుత్వం ఎన్జీటీ ఎదుట వాదనలు వినిపించింది. ఈ పథకానికి ప్రత్యేక సమగ్ర పథక నివేదిక రూపొందించడంపై ఆక్షేపణ ఎదురైంది. దీంతో పథకం అందుబాటులోకి వచ్చినా.. వివాదం నేపథ్యంలో భవితవ్యం అగమ్యగోచరమైంది.
రెండేళ్లుగా నిలిచిన సాగునీరు..
పురుషోత్తపట్నం పథకానికి గత రెండేళ్లుగా నీటి సరఫరాను నిలిపివేశారు. ఎన్జీటీలో వ్యాజ్యం కారణంగా 2020 ఖరీఫ్‌కు నీరు ఇవ్వలేమని ఇటీవల కాకినాడలో జరిగిన జిల్లా సమీక్షలో జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వివాదం కొలిక్కి వచ్చే వరకు దీని పరిధిలో రైతులకు సాగునీరు అందే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో ఏలేరు ఆధునికీకరణలో భాగంగా ఏడు మండలాల్లో రూ.264 కోట్లతో చేపట్టాల్సిన పనులు సైతం ప్రశ్నార్థకంగా మారాయి. ఈ పనులు పూర్తయి చిక్కుముళ్లు వీడితే 67,600 ఎకరాల భూములకు సాగునీరు అందే వీలుంది. ఈ ఆధునికీకరణ పనుల చివరి దశలో వివాదం తెరమీదకు రావడం గమనార్హం.
ఇదీ చదవండి: