కండువా కప్పుకునేందుకు తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే నిరాకరణ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో వైకాపా అధినేత జగన్ కు వింత అనుభవం ఎదురైంది. పి.గన్నవరం అసెంబ్లీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పులిపర్తి నారాయణమూర్తికి ఈసారి తెదేపా అధిష్ఠానం టిక్కెట్ ఇవ్వని కారణంగా... వైకాపాలో చేరేందుకు సిద్ధమైపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో వైకాపా భారీ ర్యాలీ నిర్వహించింది. వైకాపా అధినేత సమక్షంలో పార్టీలోకి చేరేందుకు పులిపర్తి సిద్ధమై జగన్ ఉన్న ప్రచార వాహనంపైకి ఎక్కారు. ఈ క్రమంలో జగన్..పార్టీ కండువా వేసేందుకు ప్రయత్నించగా... పులిపర్తి సున్నితంగా తిరస్కరిస్తూ నమస్కారం చేశారు. ఇలా రెండు మూడు సార్లు జగన్ ప్రయత్నించినప్పటికి ఆయన మాత్రం దూరంగా జరిగిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న ఫ్యాన్ పార్టీ నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే. పులిపర్తికి జగన్ నుంచి ఎలాంటి హామీ రాకపోవటంతోనే ఆయన కండువా వేసుకునేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.