తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో తనకు శిరోముండనం చేసిన వ్యవహారంపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించినట్లు బాధితుడు ఇండుగుమిల్లి ప్రసాద్ తెలిపారు. ‘‘ఇసుక మాఫియాను ఎదురించినందుకు నాకు పోలీసుస్టేషన్‌లోనే శిరోముండనం చేశారు. ఇందుకు కారకులైన ముఖ్య వ్యక్తులను అరెస్టు చేయకపోవడంతో నేను మానసికంగా ఆవేదన చెందుతున్నాను. నక్సలైట్‌గా మారేందుకు అనుమతిస్తే నా గౌరవాన్ని రక్షించుకుంటా’’ అని పేర్కొంటూ ఇటీవల రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌కు వెబ్‌సైట్ ద్వారా బాధితుడు ప్రసాద్ లేఖ పంపిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం సంబంధిత దస్త్రాన్ని ఏపీకి చెందిన సాధారణ పరిపాలన విభాగానికి బదిలీ చేసిందని, సహాయకార్యదర్శి జనార్దన్‌బాబుకు బాధ్యతను అప్పగించిందని, ఈ కేసు విషయంలో ఆయనకు సహకరించాలని సూచించిందని బాధితుడు ప్రసాద్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం వల్ల న్యాయం జరగకపోవడం వల్లనే లేఖ పంపించాను. తక్షణం రాష్ట్రపతి స్పందించడంతో నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. సహాయకార్యదర్శి జనార్దన్‌బాబు గురువారం మునికూడలి వచ్చి నా దగ్గర నుంచి అవసరమైన వివరాలు తీసుకుంటారని వెలగపూడి కార్యాలయం నుంచి నాకు సమాచారం వచ్చింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలకు కొద్ది గంటల ముందే అట్రాసిటీ కేసులో భాగంగా రూ.50 వేల పరిహారాన్ని రెవెన్యూ అధికారులు హడావుడిగా వచ్చి అందించారు’ అని వివరించారు.
వైకాపా నేత కవల కృష్ణమూర్తి అతని అనుచరులు శిరోముండనం చేయించేలా పోలీసులను ప్రోత్సహించారని బాధితుడు ఆరోపించారు. ఈ కేసులో అన్ని చర్యలూ తీసుకున్నామని ఏలూరు రేంజి డీఐజీ చెప్పడం సరికాదన్నారు. అసలు నిందితులను కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనను తప్పుదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనడం డీఐజీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ ఏ1 నుంచి ఏ6 వరకు ముద్దాయిలను వదిలేసి కొత్తగా విధుల్లో చేరిన పోలీసులపై చర్యలు తీసుకుని న్యాయం చేశామనడం సరికాదని చెప్పారు. రాష్ట్రపతి కార్యాలయం ప్రసాద్ వినతిపై తక్షణం స్పందించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.