తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం పల్లిపాలెం గ్రామంలో ప్రభల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ప్రభల తీర్థక్షేత్రంగా పల్లిపాలెం ఎంతో ప్రసిద్ధి.. దశాబ్దాల కాలంగా సమీపంలోని 15 గ్రామాలకు చెందిన పెద్దలు, యువకులు తమ గ్రామంలో కులదైవం పటాలతో ప్రభలు తయారు చేసి.. ఆయా గ్రామాల నుంచి ఊరేగింపుగా పల్లెపాలెం తీర్థక్షేత్రంకు తీసుకువచ్చారు. ఈ ఊరేగింపులో ప్రధాన రహదారులు, పంటలు, కాలువలు, చెరువుల మీదుగా సాగడంతో ఆద్యంతం ఆసక్తిగా మారింది. వీటిని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
ప్రభలతో ప్రజ్వరిల్లిన పల్లెపాలెం.. అంగరంగ వైభవంగా ఊరేగింపు
సంక్రాంతి సంబరాల్లో మూడోరోజు కనుమ పండుగ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభల ఊరేగింపులు, గోపూజలతో సందడిగా సాగాయి. ప్రభల తీర్థక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన జిల్లాలోని పల్లిపాలెం గ్రామంలో ప్రభల ఊరేగింపు వైభవంగా జరిగింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రభలలను చూసేందుకు వచ్చిన జనాలతో పల్లిపాలెంలో పండుగ వాతావరణం నెలకొంది.
ప్రభలతో ప్రజ్వరిల్లిన పల్లెపాలెం
కనుమరోజు పల్లెతీర్థంలో ప్రభల ఊరేగింపు వైభవంగా సాగింది. భక్తులు ప్రభలను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రభల తీర్థక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన భక్తులను అలరించింది.
ఇదీ చదవండి: అవిడిలో అంగరంగ వైభవంగా ప్రభల ఊరేగింపు