కరోనా వేగంగా విస్తరిస్తోన్న వేళ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ల కొరత వైద్యులను, ప్రభుత్వాలనూ వేధిస్తోంది. రాష్ట్రంలోనూ సుమారు 2 లక్షల పీపీఈ కిట్ల అవసరం ఉండటంతో ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పీపీఈ సూట్ల తయారీ బాధ్యతను తూర్పుగోదావరి జిల్లా యూ.కొత్తపల్లి మండలం మూలపేటలోని పాల్స్ ప్లస్ బొమ్మల తయారీ పరిశ్రమకు అప్పగించింది. ఇక్కడ రోజుకు సుమారు 4వేల సూట్లు తయారయ్యే సామర్థ్యం ఉండటం వల్ల అధికారులు ఈ పరిశ్రమను ఎంపిక చేశారు. వినైల్ క్లాత్‌తో తయారుచేసే ఈ సూట్లకు సంబంధించి నాలుగు రోజుల పాటు శిక్షణనిచ్చారు. అవసరమైన సామగ్రిని ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించారు.
రోజుకు రెండు వేలు..
పాల్స్ ప్లస్ పరిశ్రమలో ఈ ప్రత్యేక సూట్ల తయారీ సోమవారం నుంచి ప్రారంభమైంది. తల నుంచి కాళ్ల వరకు పూర్తిగా మూసివేస్తూ కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా ఈ సూట్లు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ డైరెక్టర్ ఈ పరిశ్రమను సందర్శించి ఇక్కడి ఉత్పత్తి సామర్థ్యం మేరకు రాష్ట్రం మొత్తానికి సరిపడా సరఫరా చేయొచ్చని నిర్ణయించారు. ప్రస్తుతం పరిశ్రమలో పనిచేస్తున్నవారిని బట్టి రోజుకు రెండు వేల సూట్ల వరకు తయారవుతాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. వీటి తయారీ కోసం ఉప్పాడ, పిఠాపురం, మూలపేట సహా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టైలర్లు సహకరిస్తున్నారు.