రాష్ట్ర ప్రజల జీవనాడీ పోలవరం ప్రాజెక్టు టెండర్ల రద్దుపై అథారిటీ స్పందించింది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశమైంది. ఈ భేటీ అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఛైర్మన్ ఆర్.కె.జైన్ మీడియాతో మాట్లాడారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని.. నిర్మాణం కూడా జాప్యం జరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
పోలవరం పనులు చేస్తున్న గుత్తేదారు నవయుగ పనితీరు సంతృప్తికరంగా ఉందని చెప్పారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంత వ్యయం పెరుగుతుందనేది ఇప్పుడే అంచనా వేయలేమన్న జైన్... పనుల్లో జాప్యం తప్పదని పేర్కొన్నారు. వ్యయం పెరిగితే కేంద్రం భరించబోదని స్పష్టం చేశారు. సుమారు 5గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా పోలవరం టెండర్ల రద్దుపై చర్చ జరిగింది.