A bumpy cotton barrage road : ప్రతిష్ఠాత్మక ఆనకట్ట సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీపై పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఆనకట్ట నిర్వహణ లోపభూయిష్టంగా మారగా.. రాత్రిళ్లు అటు వైపు వెళ్లేందుకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. భారీ వాహనాలకు అనుమతి లేకపోయినా పెద్ద ఎత్తున రాకపోకలు కొనసాగిస్తుండడంతో ఇరువైపులా రోడ్లు దెబ్బతిన్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రతిష్ఠాత్మకమైన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ రహదారి ధ్వంసమైంది. గుంతల రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రాత్రిపూట లైట్లు వెలగకపోవడంతో కాటన్ బ్యారేజీపై చిమ్మచీకట్లు కమ్ముకుంటున్నాయి. కాటన్ బ్యారేజీపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యారేజీ నిర్వహణను గాలికి వదిలివేయడం, కనీస మరమ్మత్తులు కూడా చేపట్టకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఛిద్రమైనా తగ్గని వాహనాల రద్దీ..: ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీపై రహదారి దెబ్బతిన్నది. బ్యారేజీ ప్రారంభం నుంచి చివరి వరకు రోడ్డు ధ్వంసమైంది. గతంలో సిమెంట్ రోడ్డుపై తారు, చిప్స్ తో వేసిన పొర దాదాపుగా కొట్టుకు పోయింది. గుంతలతోపాటు ఛిద్రమైన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. కాటన్ ఆనకట్టపై ధవళేశ్వరం, ర్యాలీ, మద్దూరు, విజ్జేశ్వరం నాలుగు ఆర్మ్ ఉంటాయి. మధ్యలో అనుసంధాన రహదారి ఉంటుంది. ధవళేశ్వరం, ర్యాలీ ఆర్మ్ పై తారురోడ్డు పూర్తిగా కోతకు గురైంది. గుంతలు పడి ఇనుప చువ్వలు బయటపడ్డాయి. కాటన్ బ్యారేజీపై ప్రస్తుతం వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ధ్వంసమైన రహదారిపై రాకపోకలు సాగిస్తూ.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.