Somu Veerraju: కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం గంటపాటు హైడ్రామా నెలకొంది. జిల్లాలో మే నెలలో జరిగిన అల్లర్లలో అక్రమ అరెస్టులకు గురైన వారి కుటుంబాలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పరామర్శించేందుకు బయల్దేరారన్న సమాచారంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో జొన్నాడ జాతీయ రహదారిపై ఆలమూరు ఎస్సై సోమన శివప్రసాద్ తన సిబ్బందితో ఆయన కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. ఒక ప్రైవేటు లారీని తెచ్చి రోడ్డుపై అడ్డంగా పెట్టడంపై వీర్రాజు అసహనం వ్యక్తంచేశారు. పర్యటనకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఎస్సైతో వాదనకు దిగారు. ఒక దశలో ఆవేశానికి లోనై ఎస్సైని నెట్టేశారు. పోలీసు సిబ్బంది వారిస్తున్నా వినలేదు. ప్రైవేట్ వాహనదారుడితోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వడంతో ఆయన తన వాహనంలో రావులపాలెం వెళ్లిపోయారు. అనంతరం సోము వీర్రాజుపై ఆలమూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు విధుల్లో ఉన్న ఎస్సైని నెట్టారని 353, 506 సెక్షన్లపై కేసు పెట్టారు. మండపేట రూరల్ సీఐ శివగణేష్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
జగన్ ఆటలను సాగనివ్వం: సోము వీర్రాజు
రాష్ట్రంలో జగన్ ఆటలను భాజపా ఎంతో కాలం సాగనివ్వదని సోము వీర్రాజు స్పష్టంచేశారు. కోనసీమ జిల్లా భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి తల్లి ఇటీవల మృతి చెందడంతో బుధవారం సోము వీర్రాజు ఆమెను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ‘అమలాపురం గొడవలకు ప్రభుత్వ అనాలోచిత వైఖరే కారణం. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న పిరికిపంద చర్యలకు మేం భయపడం. నేను రాజమహేంద్రవరంలో బయలుదేరినప్పటి నుంచి పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. జొన్నాడలో పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లు కాలిపోతే పోలీసులు ఏమి చేశారు’ అని ప్రశ్నించారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయ్యాజీ వేమ, జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు, స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ పాలూరి సత్యానందం తదితరులు పాల్గొన్నారు.