Bhadrachalam boy kidnapping case : తెలంగాణ రాష్ట్రం భద్రాచలం పట్టణంలోని ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల విద్యార్థి అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ రోహిత్ రాజ్ భద్రాచలంలోని తన కార్యాలయంలో వెల్లడించారు. జనవరి 6న బాలుడు అదృశ్యమైనట్లు అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలుడు అదృశ్యం కావడానికి గల కారణాలపై దృష్టి సారించిన పోలీసులు దగ్గర్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.
డబ్బుపై ఆశ: ఫుటేజీ ఆధారంగా భద్రాచలంలోని అశోక్‌నగర్‌కు చెందిన కందుల అన్నపూర్ణ, ఆమె కుమార్తె అనూష, కుమారుడు సాయిరాం డబ్బుపై ఆశతో ఈ బాలుడిని అపహరించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఆ కుటుంబంపై నిఘా పెట్టి విచారణ చేయగా.. బాలుడిని రాజమహేంద్రవరానికి చెందిన స్నేహలత, ఇషాక్ గున్నం దంపతులకు మధ్యవర్తి బి.తులసి ద్వారా రూ.4.5 లక్షలకు అమ్మినట్లు గుర్తించారు. ఇందులో రూ.50 వేలు మధ్యవర్తికి ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు పక్కా వ్యూహంతో ఛేదించి బాలుడిని విక్రయించిన కుటుంబాన్ని అదుపులోకి తీసుకొని విచారించారు.
స్వాధీనం:వారిచ్చిన సమాచారంతో బాలుడిని కొనుగోలు చేసిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు. నిందితుల నుంచి రూ.3.10 లక్షల నగదు, 6 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. బాలుడిని చైల్డ్‌లైన్ విభాగం ఆధ్వర్యంలో కుటుంబసభ్యులకు అప్పగించారు. పాఠశాలకు వచ్చేటప్పుడు, ఇంటికి వెళ్లేటప్పుడు బాలుడిని అన్నపూర్ణ కుటుంబం తమ ఇంటికి తీసుకెళ్లి మచ్చిక చేసుకుని.. పథకం ప్రకారం కిడ్నాప్ చేసినట్లు ఏఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు.
భద్రాచలంలో బాలుడి కిడ్నాప్.. రూ.4.5 లక్షలకు రాజమహేంద్రవరంలో విక్రయం "జనవరి 6న బాలుడు అదృశ్యమైనట్లు మాకు ఫిర్యాదు వచ్చింది. దీంతో మేము వివిధ బృందాలుగా ఏర్పాడి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. నిందితులు అందరూ.. బాలుడు చదువుకునే స్కూల్ దగ్గర్లో ఉన్న ఇంటి వారే. వారు బాబుని మచ్చిక చేసుకొని కిడ్నాప్ చేశారు. బాలుడిని రాజమహేంద్రవరానికి చెందిన స్నేహలత, ఇషాక్ గున్నం దంపతులకు మధ్యవర్తి బి.తులసి ద్వారా రూ.4.5 లక్షలకు విక్రయించారు. నిందితుల నుంచి రూ.3.10 లక్షల నగదు, 6 చరవాణులను స్వాధీనం చేసుకున్నాం. బాలుడిని చైల్డ్‌లైన్ విభాగం ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అప్పగించాం".- రోహిత్ రాజ్, ఏఎస్పీ భద్రాచలం
ఇవీ చదవండి: