కారుకి పోలీస్ సైరన్ తగిలించాడు... ముందు కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్ పేరుతో పెద్ద బోర్డు పెట్టించాడు. దర్జాగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జనాన్ని తరలిస్తున్నాడు. పోలీసులకు దొరక్కుండా వెళ్దామనుకున్నాడు.
పోలీస్ సైరన్ తగిలించి.. ప్రయాణికులను తరలించే!
లాక్డౌన్ సమయంలో ప్రయాణికులను తరలిస్తూ ఓ వ్యక్తి సొమ్ము చేసుకుంటున్నాడు. ఎవరూ అడ్డు చెప్పకుండా తన వాహనాన్ని ప్రభుత్వ వాహనంగా మార్చాడు. అది చాలదన్నట్లు పోలీసు సైరన్ పెట్టించాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.
విజయవాడకు చెందిన శ్రీకాంత్ కమర్షియల్ టాక్స్ అధికారులకు అద్దె ప్రాతిపదికన కారు నడుపుతున్నాడు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా అధికారులు విధుల్లో లేకపోవడంతో.. ఆ కారుకు పోలీసు సైరన్ తగిలించి జనాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. తూర్పు గోదావరి జిల్లా తుని - నర్సీపట్నం రహదారిలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో సైరన్ వేసుకుంటూ వచ్చాడు శ్రీకాంత్. వాహనాన్ని చూసిన సీఐ కిషోర్ బాబు ఆపే ప్రయత్నం చేశారు. అయినా ఆపకుండా శ్రీకాంత్ దూసుకుపోయాడు. అనుమానం వచ్చి... కోటనందూరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ ఎస్సై అశోక్ కారును ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదు. దీంతో వెంటాడి కారును నిలుపుదల చేశారు. అసలు విషయం బయటకు వచ్చింది. కారులోని ప్రయాణికులను పంపించి.. పోలీసులు కారును సీజ్ చేశారు.
ఇదీ చదవండి: ఎక్స్‌రేతో 5 సెకన్లలో కరోనాను గుర్తించే సాఫ్ట్వేర్!