తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఓ వ్యక్తిని గుర్తించిన స్థానిక సీఐ వై.రాంబాబు, ఎస్ఐ టి.రామకృష్ణ అతని స్థితిగతులను మార్చేశారు. సర్కిల్ ఆఫీస్ వద్దకు తీసుకొచ్చి కటింగ్, షేవింగ్ చేయించారు. స్వయంగా సీఐ, ఎస్ఐలు స్నానం చేయించారు. అనంతరం అతడికి నూతన వస్త్రాలను అందజేసి, కడుపునిండా భోజనం పెట్టారు.
మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని ఆదరించిన పోలీసులు
ఓపక్క కరోనా కట్టడిలో భాగంగా కాస్తంత కూడా తీరిక లేకుండా విధులు నిర్వర్తిస్తూనే సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకుంటున్నారు పోలీసులు. లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న వారికి అండగా ఉంటున్నారు. ఒకరోజు పని లేకపోతే పూట గడవని నిరుపేదలకు తామున్నామంటూ వారి బాగోగులు చూస్తున్నారు. జగ్గంపేటలో ఎన్నో రోజులుగా మతిస్థిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. దగ్గరకు చేర్చుకుని.. ఆకలి తీర్చి... అవతారం మార్చి మానవత్వం చాటుకున్నారు.
మానవత్యం చాటుకున్న పోలీసులు
ఎక్కడి నుంచి వచ్చావు..? నీ పేరు ఏంటి..? అని సీఐ రాంబాబు అడగ్గా... హర్యానా రాష్ట్రంలోని నుత్యాన్న అని, తన పేరు శంకర్ దాస్ అని సమాధానమిచ్చాడు. అనంతరం అతనిని జగ్గంపేట హైవే మొబైల్ వాహనంలో ఎక్కించి పట్టణ శివారులోని హర్యానా దాబా హోటల్ వద్దకు పంపించారు. అక్కడ హోటల్ నిర్వాహకులు అతని భాషలో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. అతని స్వగ్రామం వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.