కృష్ణా జిల్లాలో...
రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నందున జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు సూచనల మేరకు.. నందిగామ డీఎస్పీ జి.నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం మాస్కులు పంపిణీ చేశారు.
పామర్రు ఎన్టీఆర్ సర్కిల్లో మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న వాహన చోదకులకు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, డీఎస్పీ సత్యానందం మాస్కులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలంటూ పోలిసులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. కొవిడ్ నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే.. మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పారు.
గన్నవరంలో కరోనా నిబంధనలపై పోలీసులు అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని, కరోనా వైరస్ పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించరాదని సూచించారు.
విజయవాడలో...
నగర పరిధిలో మాస్కులు లేకుండా ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నగరంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా వాహనదారులకు కొవిడ్ జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.