ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువతి కిడ్నాప్ కేసు:  మరో "ఉయ్యాల జంపాల" సినిమా! - rajanagaram kidnap case chased

rajanagaram kidnap case: తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఈనెల 15న యువతి అపహరణకు గురైన కేసును.. పోలీసులు చేధించారు. ఆధారాలతో నిగ్గు తేల్చిన పోలీసులు.. వివరాలు వెల్లడించారు. ఈ వివరాలు చూస్తే.. ఉయ్యాల జంపాల" సినిమా కనిపించింది.

రాజానగరం కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

By

Published : Dec 18, 2021, 7:08 PM IST

Updated : Dec 18, 2021, 7:49 PM IST

Rajanagaram kidnap case: తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని(19) బుధవారం అదృశ్యమైంది. బీటెక్‌ చదువుతున్న ఆ యువతి.. ఉదయం ఇంటి నుంచి బస్సులో బయలుదేరినా.. కళాశాలకు వెళ్లలేదు. సాయంత్రమైంది. తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. ముందుగా అమ్మాయిని క్షేమంగా ఇల్లు చేర్చారు. తర్వాత నిందితున్ని కటకటాల్లోకి నెట్టారు. ఆ తర్వాత ఈ కిడ్నాప్ వ్యవహారానికి విత్తనం ఎక్కడ పడిందన్న దగ్గర్నుంచి.. బట్ట బయలు అయ్యేదాకా ఏం జరిగిందో స్టోరీ మొత్తం చెప్పేశారు. మీరూ తెలుసుకోండి.. జాగ్రత్తగా మసులుకోండి..

సీన్ ఓపెన్ చేస్తే..
అతగాడి పేరు ఫణీంద్ర. అతడో సార్థక నామధేయుడు. అంటే.. ఇతని పేరుకు (ఫణి అంటే పాము) తగినట్టుగానే.. ఇతరులపై విషం చిమ్మే బ్యాచ్ కు చెందినవాడు. గతంలో కొందరిపై చిమ్మాడు కూడా! మరి, దొంగ చేలో తిండికి అలవాటు పడిన గొడ్డు ఓ పట్టాన మానదు కదా? ఇతనిదీ అదే యవ్వారం అన్నమాట. ఎప్పుడూ మందిని ముంచటం ఎలా అనే ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా గాలాలు వేయడం మొదలు పెట్టాడు. అలా గాలం వేశాడో లేదో.. ఓ అమాయకపు యువతి చిక్కింది. పంట పండిందని అనుకున్నాడు. వెంటనే ప్లాన్ అమలు చేయడం మొదలు పెట్టాడు.

స్నాప్ చాట్ ద్వారా యువతికి పరిచయమైన ఫణీంద్ర.. వెంటనే తనలోని ప్రేమికుడి మాస్కును ముఖానికి తగిలించుకున్నాడు. "నువ్వు లేక నేను లేను" అనే స్టైల్లో ప్రేమగీతాలు ఆలపించాడు. స్నాప్ చాట్ నుంచి, వాట్సాప్ చాట్ దాకా అన్నీ ముచ్చట్లే! ఇంకేముందీ.. ఇదే నిజమైన ప్రేమ కావొచ్చని, ఇలాంటి ప్రియుడు మరొకరికి దొరకడని ఆ అమాయకురాలు నమ్మేసింది. ఫణీంద్ర అలియాస్ పాము పని ఈజీ అయిపోయింది. చూస్తుండగానే ఆర్నెల్లు గడిచిపోయాయి. ఇప్పటికే టైం వేస్టు చేశానని అనుకున్నాడో ఏమో.. లవ్ మాస్కు తొలగించడానికి రెడీ అయిపోయాడు.

వన్ ఫైన్ డే.. బైక్ పై అలా లాంగ్ రైడ్ కు వెళ్దామన్నాడు. లవ్ లో జాలీ రైడ్ ను ఊహించుకున్న అమ్మాయి.. ఓకే చెప్పేసింది. డేటు, టైం ఫిక్స్ చేసుకున్నారు. బుధవారం కాలేజీకని చెప్పి బస్సులో వచ్చి.. మధ్యలో బస్సు దిగి, బండెక్కి వెళ్లాలి. ఇదీ.. ప్లాన్. ఇక్కడి వరకు అనుకున్నట్టే జరిగింది. బుధవారం ఉదయం ఇంటి నుంచి కళాశాలకు బస్సులో బయలుదేరిన యువతి.. కళాశాలకు వెళ్లకుండా.. మార్గం మధ్యలో రాజానగరంలో బస్సు దిగింది. అక్కడ సదరు యువకుడి ద్విచక్రవాహనం ఎక్కి వెళ్లింది.

సీన్ కట్ చేస్తే..
అదే రోజు మధ్యాహ్నం వేళ.. సదరు యువతి తండ్రి ఫోన్‌ మోగింది. "మీ అమ్మాయి నా దగ్గర ఉంది. మీ అమ్మాయిని కిడ్నాప్‌ చేశా. రూ.5 లక్షలు ఇవ్వండి. లేకుంటే చంపేస్తాం." ఇదీ.. ఆ ఫోన్ కాల్ సారాంశం. తీవ్ర భయాందోళనకు గురైన తండ్రి.. పోలీసుల చెంతకు పరిగెత్తాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం రాత్రి నుంచి వేట మొదలు పెట్టారు. 8 బృందాలుగా విడిపోయిన పోలీసులు.. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు పాము ఉరఫ్ ఫణీంద్రను భీమవరంలో పట్టుకున్నారు. అక్కడ బాధితురాలిని ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసినట్టు పోలీసులు గుర్తించారు.

రాజానగరం కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకుంటున్నా.. ఇప్పటికీ జనం మేల్కోకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. ఇలాంటి మోసగాళ్ల పట్ల యువతులు, మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏ కంప్యూటర్ వెనుక ఏ ముఖం దాగుందో తెలియదు కాబట్టి.. ఆన్ లైన్లో ప్రేమలకు, రిలేషన్లకు పుల్ స్టాప్ పెట్టాలను హెచ్చరిస్తున్నారు. చికిత్సకన్నా నివారణే మేలనే చందంగా.. మోసపోయిన తర్వాత బాధపడే కన్నా ముందుగానే అప్రమత్తమవడం మేలని జాగ్రత్త చెబుతున్నారు.

సంబంధిత కథనం:

STUDENT MISSING CASE: ఇంజనీరింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో నిందితుడి అరెస్ట్

Last Updated : Dec 18, 2021, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details