తమ ధనదాహానికి అడ్డు అదుపూ లేనట్లుగా వైకాపా నేతలు పంచభూతాలనూ దోచేస్తూ... ప్రకృతి వనరుల విధ్వంసానికి పాల్పడుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా రెండేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని మండిపడ్డారు. లేటరైట్ తవ్వకాల ముసుగులో రూ. వేల కోట్ల బాక్సైట్ అక్రమ తవ్వకాలపై సీబీఐ విచారణ జరిపించి.. నిజాలు నిగ్గు తేల్చేవరకూ తవ్వకాలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి వద్ద తెదేపా నేతల్ని పోలీసులు అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
వైకాపా నేతల అక్రమ బాక్సైట్ మైనింగ్ బయటపడుతుందనే తెదేపా నేతల్ని అరెస్టు చేశారు. ఏతప్పూ చేయకుంటే ప్రతిపక్షనేతల్ని ఎందుకడ్డుకున్నారు. రాజారెడ్డి రాజ్యాంగంలో మానవహక్కుల్ని కాలరాస్తూ ప్రతిపక్ష నేతలకు ప్రశాంతంగా పర్యటించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారు. గిరిజనుల ఉనికికే ముప్పు వాటిల్లేలా అక్రమ మైనింగ్ చేస్తున్న వైకాపా నేతలు ఆదివాసీల హక్కుల్ని కాలరాస్తున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన పోలీసులు వారికి సహకరించటం దారుణం. వైకాపాకు చెందిన ఓ బినామీ వచ్చే 5ఏళ్లలో రూ.15వేల కోట్ల తవ్వకాలు చేయనున్నట్లు గిరిజన నేతతో చేసిన సంభాషణ ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి.-చంద్రబాబు, తెదేపా అధినేత
అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడేవరకు పోరాటం ఆగదు: లోకేశ్
విశాఖ-తూర్పుగోదావరి జిల్లాల మన్యంలో లేటరైట్ ముసుగులో సాగించే బాక్సైట్ అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేసే వరకూ తెదేపా పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నేతలను ఫోన్లో లోకేశ్ పరామర్శించారు. గిరిజన హక్కుల్ని కాపాడుతూనే ప్రభుత్వ ప్రాయోజిత మైనింగ్ మాఫియాను తరిమికొట్టేందుకు స్థానికులతో కలిసి ఉద్యమించాలని సూచించారు.
గనుల మాఫియాలో ఘనుడైన జగన్ రెడ్డి.. తన వారిని రంగంలోకి దింపి అభయారణ్యంలో లాటరైట్ ముసుగులో బాక్సైట్ మైనింగ్ చేయిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాల ద్వారా జగన్ రెడ్డి సోదరులు రూ.15వేల కోట్ల సంపాదనకు తెరలేపారని లీకైన ఆడియోపై నిజనిర్దాణ కోసం రౌతులపూడి వెళ్లిన తెదేపా బృందాన్ని కొవిడ్ నిబంధనల పేరుతో అడ్డుకోవటాన్ని ఖండిస్తున్నాం. మైనింగ్ మాఫియాకు ఖాకీలు అండగా నిలిచారు. తెదేపా నేతల్ని అడ్డుకోవటంతో మైనింగ్ మాఫియా జరుగుతోందని ఒప్పుకున్నట్లే.- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
జగన్ రెడ్డి తన వారసత్వాన్ని పంచుతున్నారు: అచ్చెన్నాయుడు
మైనింగ్ మాఫియాలో జగన్ రెడ్డి తన వారసత్వాన్ని వైకాపా నేతలకు పంచుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. లేటరైట్ ముసుగులలో అక్రమంగా బాక్సైట్ దోచుకుంటున్న వారిని వదిలి, అన్యాయాన్ని ప్రశ్నించే తెదేపా నేతల్ని పోలీసులు అడ్డుకోవడం ఎంటని ప్రశ్నించారు. పోలీసులు వైకాపా నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు. అధికారం అండతో నిబంధనలకు విరుద్ధంగా మన్యంలో చెట్లు నరికి రాత్రికి రాత్రి రహదారి వేశారు. ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తూ.. వారిపై దౌర్జన్యం చేస్తున్నది పోలీసులకు కనపడట్లేదా. అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గకుంటే గిరిజనులతో కలిసి తిరగపడతాం' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
ఇది అవినీతి పాలనకు పరాకాష్ట: కొల్లు రవీంద్ర
ముఖ్యమంత్రి జగన్ సోదరులే మైనింగ్ మాఫియాకు దిగటం.. అవినీతి పాలనకు పరాకాష్టని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైకాపా నేతలు తమ అక్రమ మైనింగ్ బయటపడకుండా పోలీసుల అండతో తెదేపా నేతల్ని అడ్డుకున్నారు. మన్యంలో రహదారి ఏర్పాటుకు అంగీకరించిన కొవిడ్ నిబంధనలు.. తెదేపా నేతల పర్యటనకే అడ్డొచ్చాయా అని ప్రశ్నించారు. మైనింగ్ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించి నిజాలు బహిర్గతం చేయాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా బృందం
తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో తెలుగుదేశం నేతల బృందాన్ని(tdp team) పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ సరిహద్దుల్లో లేటరైట్(Laterite Digging)) తవ్వకాల పరిశీలనకు వచ్చిన తెలుగుదేశం నాయకులు.. గిరిజనులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించేందుకు వచ్చిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై నేతలు నిరసనకు దిగారు. కేవలం లేటరైట్ తరలింపునకే మన్యంలో రోడ్లు వేశారని తెదేపా బృందం ఆరోపించింది.
ఇదీ చదవండి..
బమిడికలొద్దు క్వారీ తవ్వకాలకు.. సన్నాహాలు..!