గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద భయంతో ఇళ్లను ఖాళీ చేసిన నిర్వాసితులు మైదాన ప్రాంతాలకు తరలివెళ్లారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఎగువ కాఫర్ డ్యాం పూర్తిగా మూసివేయడంతో గోదావరి జలాలు వెనక్కి పోటెత్తుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతోపాటు...స్థానికంగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పెద్దఎత్తున వరద నీరు గోదావరిలోకి చేరుతోంది. పోలవరం స్పిల్‌వే నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నా..కాఫర్ డ్యాం నుంచి వెనక్కి మళ్లిన నీరు ఊర్లను ముంచెత్తుతోంది. దేవీపట్నం మండలం జలదిగ్భందంలో చిక్కుకుంది.
కొండే వారి ఆవాసమౌతోంది..!
కొండమొదలు పంచాయతీ పరిధిలోని 11 గిరిజన గ్రామాల్లోకి నీరు చేరింది. దీంతో అడవి బిడ్డలు ఊళ్లను వదిలేసి కొండలు, గుట్టలపై తలదాచుకుంటున్నారు. వీరు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొన్న పూరి పాకల్ల్లో విద్యుత్, తాగు నీరు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. అలాగే మంటూరు నుంచి దేవీపట్నం మీదుగా వీరవరం వరకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆయా గ్రామాల్లోకి గోదావరి నీరు చేరింది. రహదారులు నీటమునిగిపోయాయి. ప్రభుత్వనం ఇప్పటికైనా తక్షణం స్పందించి పరిహారం, పునరావం కల్పించాలని నిర్వాసితులు వేడుకొంటున్నారు. పూడిపల్లిలో ఎస్సీ కాలనీ, అంగన్వాడీ కేంద్రం, పాఠశాలల్లోకి వరద నీరు చేరింది. దేవిపట్నం - తొయ్యేరు ఆర్అండ్ బీ రహదారిపై పూర్తిగా వరదనీరు చేరడంతో మంటూరు నుంచి రంపచోడవరంపై రాకపోకలు నిలిచిపోయాయి.
నీటమునిగిన పూడిపల్లి