పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి... ముంపు గ్రామాల ప్రజలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అయినా... వారికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. ముంపు గ్రామాల గుర్తింపుతో పాటు.. ఆర్థిక సహాయాల్లో.. అధికారుల నిర్లక్ష్యమే వారికి శాపంగా మారింది. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల గుర్తింపు... అశాస్త్రీయంగా జరగడమే ఈ పరిస్థితికి కారణమైంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో విలీన మండలాలైన కుక్కునీరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో 23 గ్రామాలను.. అధికారులు ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో చేర్చలేదు. గోదావరికి వరద వస్తే చాలు... ఈ గ్రామాలు నీటమునుగుతాయి. అలాంటిది పోలవరం ప్రాజెక్టు పరిధిలో ముంపు గ్రామాల జాబితాలో లేకపోవడం విచిత్రంగా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. ఈ 23 గ్రామాలు నీటిగర్భంలోకి జారుకొంటాయి. గోదావరికి 60 అడుగుల వరద వస్తేనే ఈ గ్రామాలన్నీ పూర్తి స్థాయిలో నీటమునుగుతాయి. అలాంటి గ్రామాలను ముంపు గ్రామాల్లో చేర్చకపోవడం.. తమను తీవ్రంగా నష్టపరుస్తోందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
ఈ 23 గ్రామాలను పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలుగా గుర్తిస్తేనే... నిర్వాసితులుగా ఆర్థిక సహాయాలు అందుతాయి. గిరిజనులకైతే.. భూమికి భూమి, ఇల్లు, భూ పరిహారం, ఆర్ఆర్ ప్యాకేజీ వంటివి అందుతాయి. గిరిజనేతరులకు భూమికి భూమి మినహా మిగితా ఆర్థిక సహాయాలు అందిస్తారు. నిర్వాసితల జాబితాలో లేకపోవడం వల్ల,ఈ గ్రామాలకు పునరావాస కార్యక్రమాలు అధికారులు ఇప్పటివరకు చేపట్టలేదు. గోదావరిలో నిర్మించిన ఎగువ కాఫర్ డ్యాం నదీ పరివాహక గ్రామాల్లోకి నీరు చొచ్చుకొచ్చే అవకాశం ఉన్న పరిస్థితుల్లో.. ఈ గ్రామాల ప్రజలు ఖాళీ చేయాల్సి వస్తోంది. అధికారులు పునరావాసం చూపించని పరిస్థితుల్లో.. ఎక్కడికి వెళ్లాలో తెలియని ప్రశ్నార్థకస్థితిని ఈ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నారు.