ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాచుర్యం పొందిన నాటి పీఠికాపురమే నేటి పిఠాపురం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన పురూహుతికా అమ్మవారు కొలువైన ఈ ప్రాంతాన్ని ఆ దేవి పేరుతోనే పిలిచేవారు. పట్టణంలోని శ్రీపాద వల్లభుని దర్శనానికి పొరుగురాష్ట్రాల నుంచి నిత్యం భక్తులు వస్తుంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న పట్టణంలో.. మౌలిక సదుపాయాలంటే.. అద్భుతంగా ఉంటాయనుకోవడం సహజం. కానీ కనీస సౌకర్యాలకూ పిఠాపురం ప్రజలు నోచుకోలేకపోతున్నారు.
1957 అక్టోబర్‌లో నగర పంచాయతీగా, 1980 ఏప్రిల్‌లో ద్వితీయ శ్రేణి పురపాలక సంఘంగా ఆవిర్భవించింది. తొలుత 10 వార్డులున్న ఈ పట్టణంలో ప్రస్తుతం 30 వార్డులున్నాయి. ఇప్పటికి 12సార్లు ఎన్నికలు జరగ్గా.. ఐదు సార్లు పురుషులు చైర్మన్ పీఠం అధిష్టించారు. ఇందులో దామెర వెంకట కృష్ణ సూర్యారావు నాలుగు పర్యాయాలు ఛైర్మన్గా ఉన్నారు. ఇక మూడు సార్లు మహిళలు ఛైర్పర్సన్లుగా పని చేశారు. 13వ సారి జరగనున్న ఈ దఫా ఎన్నికల్లో.. ఛైర్‌పర్సన్ పదవిని మహిళకు కేటాయించారు.