ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఫోన్‌కాల్‌.. మృత్యుపాశమైంది - సీతానగరం లో విషాదం

చెల్లెల్ని చదవించాలని పదో తరగతి వరకే చదివి మానేశాడు. బైక్ మెకానిక్​గా పనిలో చేరాడు. కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. తాను చదవకపోయినా చెల్లిని ఉన్నతస్థితిలో నిలబెట్టాలకున్నాడు. కానీ మిత్రులు సరదాగా ఈతకు వెళ్దామని చేసిన ఫోన్ అతని పాటిట మృత్యు పాశమైంది. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.

phone call death
phone call death

By

Published : Aug 3, 2021, 7:57 AM IST

సరదాగా స్నానానికి వెళ్దామని స్నేహితుడు ఫోన్‌ చేయడంతో వెళ్లిన ఆ బాలుడు ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. నదిలో గల్లంతై నిర్జీవంగా పైకి తేలాడు. దీంతో ఆ నిరుపేద కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చేతికందొచ్చిన కొడుకు దూరమవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సీతానగరం మండలంలోని ఇనుగంటివారిపేటకు చెందిన సలాది మణికంఠ(17) ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..స్నేహితుల దినోత్సవం కావడంతో ఆ రోజంతా స్నేహితులతో కలిసి సాయంత్రం వరకు ఆనందంగా గడిపాడు. ఈ క్రమంలో స్నానానికి వెళదామంటూ స్నేహితుడు విజయకుమార్‌ ఫోన్‌ చేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న మణికంఠ లేచి.. మరో స్నేహితుడు శంకరంతో కలిసి మునికూడలి-రాజంపేటకు మధ్యలో ఉన్న నదిలో స్నానానికి దిగారు. ఆ ప్రాంతమంతా గోతులు ఉండడం, ప్రవాహ వేగానికి మణికంఠ స్నేహితుల కళ్ల ముందే కొట్టుకుపోయాడు. చుట్టుపక్కలవారు వెంటనే స్పందించి పొడవైన కర్రలు అందించడంతో మిగిలిన ఇద్దరు బయటపడ్డారు. రాత్రయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో ఆరా తీస్తే నదిలో గల్లంతయినట్లు తెలిసింది. సోమవారం ఉదయం నుంచి సీతానగరం తహసీల్దారు ఎన్‌ఎస్‌ పవన్‌కుమార్‌, ఎస్సై వై.సుధాకర్‌ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, కాకినాడ నుంచి అగ్నిమాపక, ఎస్‌జీఆర్‌ఎఫ్‌ బృందాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 6 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

చెల్లెల్ని చదివించాలని..

మణికంఠ తండ్రి వీరవెంకట సత్యనారాయణ తాపీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి వెంకటలక్ష్మి ఒక ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నారు. పదో తరగతి పూర్తిచేసిన మణికంఠ ఇంటర్‌ చదవాలనే ఆశ ఉన్నా చెల్లెలు కీర్తి(12) చదువు కోసం తన చదువు ఆపేశాడు. మోటార్‌ సైకిల్‌ మెకానిక్‌ దగ్గర పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. తాను చదవకపోయినా చెల్లిని ఉన్నతస్థితిలో నిలబెట్టాలని తరచూ తమతో అనేవాడని చెబుతూ తల్లిదండ్రులు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

ఇదీ చదవండి:గుంటూరులో ఇద్దరు మహిళలపై కత్తిపీటతో వ్యక్తి దాడి..

ABOUT THE AUTHOR

...view details