ఇళ్ల స్థలాల కోసం సాగుభూమి లాక్కున్న అధికారులు.. వ్యక్తి ఆత్మహత్య
19:01 July 23
ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం భూమి సేకరించడంలో వివాదాలు చేలరేగుతున్నాయి. అనేక మంది తమ భూమిని లాక్కొవద్దంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాను సాగుచేసుకుంటున్న భూమిని.. తీసుకుంటున్నారని మనస్థాపంతో తూర్పు గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎన్నో ఏళ్లుగా తాను సాగు చేసుకుంటున్న భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించేందుకు అధికారులు సేకరిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొమ్మనాపల్లి గ్రామానికి చెందిన కోసూరి నాగేంద్రకుమార్ అదే గ్రామంలోని సర్వే నెంబర్ 70లో 40 సెంట్ల భూమిలో సుమారు 20 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల పంపిణీ లో భాగంగా కొంత భూమిని ఇప్పటికే సేకరించగా మరికొంత భూమిని సేకరించాల్సి వచ్చింది. ఈ క్రమంలో నాగేంద్రకుమార్ సాగుచేసుకుంటున్న 21 సెంట్ల భూమికి పక్కనే ఉన్న భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్లారు. ఈ సమయంలో తన భూమిని కూడా లాక్కొనే విషయంపై రెవెన్యూ అధికారులు, బాధితులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. దీంతో తానూ ఎన్నోఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని కోల్పోవాల్సి వస్తుందని ఆందోళనతో నాగేంద్ర పురుగుల మందు సేవించాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన తునిలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో నాగేంద్ర మృతి చెందాడు. ఈ విషయమై తహసీల్దార్ చిన్నారావును వివరణ కోరగా గ్రామ కంఠంలోని భూమిని ఉన్నతాధికారుల ఆదేశాలతో రెవెన్యూ అధికారులు వెళ్లి.. పనులు చేయించిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే నాగేంద్రకుమార్ సాగుచేసుకుంటున్న భూమిలో తాము ఎలాంటి పనులు చేయలేదన్నారు.
ఇదీ చదవండి: