ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోడి పందాలకు ఏర్పాట్లు పూర్తి.. అడ్డుకునేందుకు పోలీసులు గస్తీ - ముమ్మిడివరం వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజవర్గంలో సంక్రాంతి సంబరాలకు పల్లెలు సిద్ధమయ్యాయి. కోడి పందాలకు బరులు సిద్ధమయ్యాయి. పట్టణవాసులు సైతం వాటిని తిలకించేందుకు గ్రామాల్లో వాలిపోయారు. గతేడాది కన్నా ఘనంగా పందాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. మరోవైపు కోడి పందాలను అడ్డుకోవాలని పోలీసులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బైండోవర్ కేసులు నమోదు చేసి, కోడి కత్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోడిపందాల నిర్వహణపై ఆసక్తి నెలకొంది.

people not follow the police guidelines on cock fights
అడ్డుకునేందుకు పోలీసులు గస్తీ

By

Published : Jan 12, 2021, 4:35 PM IST

Updated : Jan 12, 2021, 5:59 PM IST

సంక్రాంతి వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో సందడే వేరు. కోడిపందాలతో ఊరువాడా సంబరాలు చేసుకుంటారు. కోడిపందాలపై ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఆంక్షలు విధిస్తున్నాయి. దాంతో గ్రామాల్లో జరిగే పందాల వ్యవహారం అందరికి తెలిసిపోయింది. వాటిని తిలకించేందుకు పట్టణవాసులు సైతం పల్లెల్లో వాలిపోతున్నారు. రెండేళ్లుగా కోడిపందాల నిర్వహణలో తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం ప్రత్యేక గుర్తింపు పొందింది. కోడి పందాలను కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తూ ఎల్ఈడీ తెరలపై ప్రత్యక్ష ప్రసారం చేయడం, అతిథులకు వేదికలపై ప్రత్యేక కుర్చీలు, సకల సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రాముఖ్యత పెరిగింది.

ఈ ఏడాది అదే పంథాకు అవకాశం..

గతేడాదితో పోలిస్తే కోడిపందాల ఆటలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు నిర్వాహకులు ఇప్పటికే అన్ని విధాలుగా సన్నద్ధమయ్యారు. మారుమూల ప్రాంతాల్లో భారీ ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను, నియోజకవర్గ సర్కిల్ ఇన్​స్పెక్టర్ సూచనలను పక్కనపెట్టి బరులు ఏర్పాటు చేశారు. ముమ్మడివరం నియోజకవర్గంలోని 4మండలాల్లోనూ పందాలకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా కొత్తలంక, రాజుపాలెం, ఐ.పోలవరంలో కేసనకుర్రు, తాళ్లరేవులో పిల్లంక, కాట్రేనికోనలో చెయ్యేరు గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించేందుకు జరిగిన వేలం పాట రూ.50 లక్షల వరకు వెళ్లడం గమనార్హం. పండుగ మూడు రోజులు ఈ ప్రాంతాలు జాతరను తలపించనున్నాయి. రాజకీయ నాయకులు పందాలు నిర్వహించడాన్ని పార్టీ ఇమేజ్ పెంచుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు.

పోలీసుల అడ్డగింత..

తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందాలు నిర్వహించే బరులను పోలీసులు ధ్వంసం చేశారు. ట్రాక్టర్​తో వాటిని గుంతలుగా మార్చారు. తేటగుంట శివారు ఎస్.అన్నవరం, వల్లూరు గ్రామాల్లో ఇప్పటి వరకు 21మంది పై బైండోవర్ కేసులు నమోదు చేసి, 900 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

కొత్తపేట నియోజకవర్గంలో..

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కోడి పందాల నిర్వాహకులు భారీ స్థాయిలో బరులను ఏర్పాటు చేస్తున్నారు. ఆత్రేయపురం, కొత్తపేట, రావులపాలెం మండలాల్లో పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్కడైనా బరులు సిద్ధం చేసి ఉంటే పోలీసులు ట్రాక్టర్లతో ధ్వంసం చేయాలి. కానీ కొత్తపేట నియోజకవర్గంలో మాత్రం పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆత్రేయపురం మండలంలోనే అత్యధికంగా 10కోడి పందాల బరులను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:పోలీసుల‌ హెచ్చరికలు బేఖాతర్‌.. కోనసీమలో భారీ బరులు

Last Updated : Jan 12, 2021, 5:59 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details