తూర్పుగోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామం వద్ద యానాం నుంచి ద్రాక్షారం మీదుగా రామచంద్రాపురం-రాజమండ్రి వెళ్లే ప్రయాణికులందరికీ ప్రధాన రహదారిలోని కాలువపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి ఇనుప వంతెన మాత్రమే ఆధారం. గత ఏడాది అది ఒక పక్కకు ఒరిగిపోయింది. ప్రతి రోజూ వందలాది వాహనాలు రాకపోకలు జరిగే మార్గం కావడంతో రహదారి భవనాల శాఖ అధికారులు ఇనుప వంతెన ప్రక్కన కాలువపై తాత్కాలికంగా కల్వర్టు నిర్మించారు.
కల్వర్టు కట్టారు.. వంతెన మరిచారు - ప్రమాదకరంగా కల్వర్టు
తూర్పు గోదావరి జిల్లాలో యానాం నుంచి రామచంద్రాపురం-రాజమండ్రి వెళ్లే దారిలో కల్వర్టు ఒకటి ప్రమాదకరంగా ఉంది. గతంలో ఈ మార్గంలో ఉన్న ఇనుప వంతెన శిథిలావస్థకు చేరుకోగా అధికారులు తాత్కాలికంగా అక్కడ కల్వర్టు నిర్మించి వదిలేశారు. వంతెన నిర్మిస్తామని ఏడాది గడిచినా.. పట్టించుకునే వారే లేరని ప్రయాణికులు, స్థానికులు వాపోతున్నారు.

దీనికి శాశ్వత పరిష్కారమైన వంతెన నిర్మాణాన్ని వదిలేశారు. అప్పట్లో ఆరు నెలల్లోపే నూతన వంతెన పూర్తి చేస్తామని అధికారులు చెప్పారని.. ప్రస్తుతం ఏడాది గడచినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా వాహనాలు, ప్రయాణికుల వాహనాలు ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు పైనుంచే ప్రయాణాలు సాగిస్తున్నాయని.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వారు భయపడుతున్నారు. అధికారులు వెంటనే బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:లాభాల వేటలో పేద ప్రజలను రోడ్డుపైకి తీసుకొస్తారా ?: పవన్