ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 17, 2019, 11:41 PM IST

Updated : Nov 18, 2019, 7:06 AM IST

ETV Bharat / state

పుడమికి కడలి కాటు... పేదల బతుకులకు చేటు

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరప్రాంతం కోతకు గురవుతోంది. తీరం వెంబడి ఊళ్లను సముద్రుడు తనలో కలిపేసుకుంటున్నాడు. తీరప్రాంత గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో బతుకీడుస్తున్నారు. వరుస తుపాన్ల ధాటికి జియో ట్యూబ్‌ ఛిద్రమైంది. తీరం నానాటికీ కడలి పాలుకావడంతో... ముప్పు మరింత పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నానాటికీ కోతకు గురవుతున్న ఉప్పాడ సముద్ర తీరం

పుడమికి కడలి కాటు... పేదల బతుకులకు చేటు

తూర్పు గోదావరి జిల్లాలో 161 కిలోమీటర్ల మేర సుదీర్ఘ సముద్ర తీరప్రాంతం ఉంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది నుంచి తొండంగి మండలం అద్దిరిపేట వరకు తీరం విస్తరించి ఉంది. 128 గ్రామాలు తీరం వెంబడి ఉన్నాయి. ఎంతో ప్రాధాన్యం ఉన్న తూర్పుతీరం రోజురోజుకూ తీవ్రకోతకు గురవుతోంది.

ఛిద్రమవుతోన్న బీచ్ రోడ్డు...
అంతర్వేది, ఓడలరేవుతోపాటు ఉప్పాడ ప్రాంతాల్లో కోత అధికంగా ఉంది. తుపాన్ల తీవ్రత అధికంగా ఉండే ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లో సముద్రం చొచ్చుకొస్తోంది. కాకినాడ-ఉప్పాడ బీచ్ రోడ్డు అలల ధాటికి ఛిద్రమవుతోంది. రహదారి రక్షణకు వేసిన బండ రాళ్లును దాటుకొని రహదారిపైకి అలలు ఎగసిపడుతున్నాయి.

సత్ఫలితాలనిచ్చిన జియోట్యూబ్...
తీరం కోతకు గురవుతుండటంతో... సుమారు 11 ఏళ్ల క్రితం రూ.12 కోట్లతో ఉప్పాడ పరిధిలోని రవీంద్రపురం నుంచి... మాయాపట్నం వరకు జియోట్యూబ్‌ను ఏర్పాటు చేశారు. 4 కిలోమీటర్ల పొడవున అమర్చిన జియోట్యూబ్ సత్ఫలితాలిచ్చింది. జల్‌, నీలం, లైలా, పైలాన్‌, హుద్​హుద్‌ వంటి తుపాన్ల నుంచి తీరప్రాంత ప్రజలను కాపాడింది.

కడలి ఒ‍డిలో కరిగిపోతున్న ఇళ్లు...
తీర ప్రాంతం పొడవునా రూ.150 కోట్లతో నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. ఈ పథకం విస్తరించడం మాట ఎలా ఉన్నా... జియో ట్యూబ్‌ సుమారు 4 కిలోమీటర్ల మేర పూర్తిగా ధ్వంసమయింది. ఫలితంగా సముద్రం మరింతగా ముందుకు వస్తోంది. తీరంలోని ఇళ్లు సాగరం ఒ‍డిలో కరిగిపోవడంతో స్థానికుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.

పరిస్థితి మరింత దయనీయం...
ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేట వద్ద పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గతంలో ఇక్కడ సముద్రం సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది. క్రమంగా నీటి మట్టం పెరిగి... ఊరంతా కోతకు గురవుతోంది.

నిలువ నీడ లేక దీనంగా...
తూర్పు గోదావరి జిల్లాలోని కోనపాపపేట అత్యధికంగా కోతకు గురవుతున్న గ్రామంగా రికార్డుకెక్కింది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 30 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయి. ఈ గ్రామ తీరంలో మత్స్యకార కుటుంబాలే నివసిస్తున్నాయి. ఇళ్లన్నీ కూలిపోవడంతో వీరి జీవితాలు నీడ లేక దీనంగా మారాయి.

ఈ ప్రాంతంలో కాకినాడ సెజ్ విస్తరించి ఉంది. భూములన్నీ సెజ్ పరిధిలోనే ఉన్నాయి. ఆర్థిక స్తోమత ఉన్న వారు అధిక ధర పెట్టి ఇళ్ల స్థలాలు కొనుక్కుంటున్నారు. మిగతా వారు ఒక్కో పాకల్లో మూడు, నాలుగు కుటుంబాలు కాలం వెళ్లదీస్తున్నాయి. తీరగ్రామాలు నానాటికీ కడలి పాలుకావటంతో... ముప్పు మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి-ప్రకృతి ప్రేమికుడు... ఇంటినే వనంలా మార్చాడు..!

Last Updated : Nov 18, 2019, 7:06 AM IST

ABOUT THE AUTHOR

...view details