ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా సహనం... చేతకానితనం కాదు: పవన్

జనసేన నేతలు, మహిళలపై పడిన దెబ్బలను ఎప్పటికీ మరిచిపోమని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన కార్యకర్తలు, నేతలపై... వైకాపా వర్గం దాడికి పాల్పడితే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులే దాడికి కారణమైన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్ సంస్కృతి తెస్తామంటే ప్రజలు సహించరని స్పష్టం చేశారు. ఇలాంటి మరో ఘటన జరిగితే చేతులు కట్టుకుని కూర్చోమని ఘాటుగా స్పందించారు.

పవన్
పవన్

By

Published : Jan 14, 2020, 5:38 PM IST

Updated : Jan 14, 2020, 6:22 PM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన

వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన జనసైనికులను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. కాకినాడలో పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పండుగ సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పవన్‌ వ్యాఖ్యానించారు. అకారణంగా లేని గొడవను సృష్టించారని పవన్ తెలిపారు. వైకాపా నేతల భాష దారుణంగా ఉందన్న పవన్‌.. తమవైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా దూషించారని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తమపై ఇలాంటివి సరికాదన్నారు. వైకాపా నేతల వ్యాఖ్యలు, దాడులు క్షమించరానివన్నారు. ఇలాంటి దూషణలకు దిగిన వారికి ప్రజలు ఓటేయకూడదని సూచించారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీడియా సమావేశం

ఫ్యాక్షన్ సంస్కృతి తెస్తామంటే సహించం
జనసేన నేతలు, మహిళలపై దాడిని ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. దాడికి కారకులైన ఇద్దరు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుస్థిర పాలన ఇవ్వాలని వైకాపాను కోరుతున్నామన్నారు. పాలెగాళ్ల రాజ్యం, ఫ్యాక్షన్ సంస్కృతి తెస్తామంటే ప్రజలు సహించరన్నారు. జనసేన శ్రేణులపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకూడదని కోరుకుంటున్నానని పవన్‌ వ్యాఖ్యానించారు.

అదే జనసేన అభిమతం
పరిపాలన ఒకచోటే ఉండాలి.. రాష్ట్రం అభివృద్ధి కావాలన్నదే జనసేన అభిమతం అని పవన్‌ స్పష్టం చేశారు. కేసులకు భయపడమని, అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అధికారం ఎప్పుడూ ఒకేచోట ఉండదని గుర్తుపెట్టుకోవాలన్నారు.

విశాఖలో భూములున్నాయి కాబట్టే..!
దిల్లీ పర్యటనలో రాజధాని రైతుల ఆందోళన, పెట్టుబడులు వెనక్కిపోవడంపై చర్చించామని పవన్‌ తెలిపారు. ఏపీకి సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరామని స్పష్టం చేశారు. గ్రామసచివాలయాలు ఉన్నప్పుడు మళ్లీ సచివాలయం మార్చడం ఎందుకని ప్రశ్నించారు పవన్‌. అమరావతి రాజధాని అని ఉద్యోగులంతా ఇక్కడికి వచ్చారన్నారు. ప్రజాధనం ఎన్నిసార్లు దుర్వినియోగం చేస్తారన్ని ప్రశ్నించారు. అధికార వికేంద్రీకరణ అని ఎన్నికల ముందే చెప్పి ఉండాల్సిందని పవన్‌ వ్యాఖ్యానించారు. విశాఖలో భూములున్నాయి కనుకే అక్కడ సచివాలయం అంటున్నారని ఆరోపించారు.

మీరు దాడులు చేసి మాపై కేసులు పెడతారా?. మేం శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే మీరెవరూ ఉండలేరు. నిరసనలు తెలిపే హక్కు కూడా మాకు లేదా? పోలీసులు కూడా చోద్యం చూడటం బాధ కలిగించింది. గొడవకు కారకులైన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యేపై పోలీసులే కేసు పెట్టాలి. ఇలాంటిది మరో ఘటన జరిగితే చేతులు కట్టుకుని కూర్చోం. వైకాపా నేతలు స్థాయి దాటి మాట్లాడుతున్నారు. .... పవన్ కల్యాణ్, జనసేన అధినేత

మా సహనాన్ని పరీక్షించవద్దు : పవన్
బలమున్నా సంయమనంతో వ్యవహరించామని పవన్ అన్నారు. వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలు కాలక్రమంలో మరిచిపోవచ్చు కానీ... జనసేన ఆడపడుచులు, నాయకులపై పడిన దెబ్బలు ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దన్న పవన్.. కాకినాడ ఘటనపై మంత్రిమండలిలో చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా?. అని పవన్ ప్రశ్నించారు.

ఇదీ చదవండి :తీవ్ర ఉత్కంఠ మధ్య పవన్​ కల్యాణ్​ కాకినాడ పర్యటన

Last Updated : Jan 14, 2020, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details