తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలతో కలిసి శ్రమదానం చేశారు. అనంతరం బాలాజీపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
'‘పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది. ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరు. రాజ్యాంగం కల్పించిన హక్కును అడ్డుకోలేరు. తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప వంగేది లేదు. ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఆపలేదు. పోలీసుల ద్వారా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు తొక్కేయొద్దు. మీరు తొక్కే కొద్ది మేము పైకి లేస్తాం' అని పవన్ వ్యాఖ్యనించారు.
పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు..
పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదని పవన్ అన్నారు. నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసని ప్రశ్నించారు. ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకే వచ్చానన్నారు. కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష అని అన్నారు. శ్రమదానం తనకు సరదా కాదని..,కులాల పేరిట కొందరు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజల కోసమే తిట్లు తింటున్నా
ప్రజల కోసమే తిట్లు తింటున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యనించారు. తన కోసమే ఆలోచిస్తే.. తిట్టినవారిని కింద కూర్చోపెట్టి నార తీసేవాడినిని మండిపడ్డారు. ఎన్నో మాటలు పడ్డా.. నా సహనాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఇంతకాలం మానసిక అత్యాచారాలు భరించా. ఇక నుంచి పడేది లేదు...తొక్కతీసి నార తీస్తా.' అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయని..,మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని.., యాక్షన్, కెమెరా, కట్ అని వెళ్లే వ్యక్తిని కాదన్నారు.