ఎన్నికల నిర్వహణ అంటే ఆషామాషీ కాదు.. అందులోనూ 1,072 గ్రామ పంచాయతీలున్న తూర్పుగోదావరి జిల్లాలో వీటి నిర్వహణ కత్తిమీద సామే. పంచాయతీ ఎన్నికలు ఏకంగా 24 రోజులపాటు జిల్లా యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేశాయి. గత నెల 29న ప్రారంభమైన ఈ ప్రక్రియ.. అనేక ఆటుపోట్ల మధ్య.. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఆదివారం ముగియడంతో జిల్లా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాలో నాలుగు విడతలు కలిపి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యయం ఏకంగా రూ.8.30కోట్లుగా తేలింది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సామగ్రి తరలింపునకు వాహనాలు, సిబ్బంది విధులు, వారికి పారితోషికాలు, అధికారుల వాహనాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్వహణ, ఇంధనం ఇలా పెద్ద ఎత్తున వ్యయం చేయాల్సి వచ్చింది. బ్యాలెట్ పెట్టెలు మినహా మిగతా అన్నింటికీ ఖర్చు చేశారు.