ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేనే రాజు.. నేనే మంత్రి! - పంచాయతీ ఎన్నికలు 2021

పంచాయతీల్లో అధికార పీఠం దక్కించుకోవాలి. స్థానిక సంస్థల్లో వ్యక్తిగతంగా.. పార్టీపరంగా బలోపేతం కావాలి.. ఎన్నో ఏళ్లుగా నాయకుల వ్యూహమిది.. పంచాయతీల్లో పట్టున్నా.. స్థానికంగా పరపతి ఉన్నా.. రిజర్వేషన్లు మారడంతో చాలాచోట్ల.. సర్పంచి పీఠం అధిరోహించడానికి సాధ్యం కాని పరిస్థితి. ఇలా ఇరకాటంలో పడిన నాయకుల్లో కొందరు తాజా ఎన్నికల్లో వార్డు సభ్యులుగా బరిలోకి దిగి.. ఉప సర్పంచి పదవి దక్కించుకుని.. పాలనలోనూ, పంచాయతీలోనూ అన్నీ తామై పెత్తనం చెలాయించేలా పావులు కదువుతున్నారు. దీంతో స్థానిక ఎన్నికల్లో రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఇబ్బందులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ఇబ్బందులు

By

Published : Jan 31, 2021, 11:31 AM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని గేదెల్లంక పంచాయతీ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ ఇతర సామాజికవర్గానికి చెందినవారు ఉప సర్పంచి పదవి దక్కించుకోవడం ద్వారా పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.

కాట్రేనికోన మండలం చిర్రయానాం, నడవపల్లి పంచాయతీ స్థానాలూ మహిళలకే కేటాయించడంతో ఇక్కడా అదేపరిస్థితి నెలకొంది.

ఏలేశ్వరం మండలం లింగంపర్తి పంచాయతీ ఎస్సీ మహిళకు కేటాయించారు. ఇక్కడ వైకాపా, జనసేన, తెదేపా.. ఉప సర్పంచి పదవిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

క్షేత్రంలో.. కుర్చీలాట...

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పంచాయతీ రిజర్వేషన్‌ ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో స్థానికంగా పీఠాన్ని ఆశించిన నాయకులకు అవకాశం లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు అతనికి అనుకూలమైన అభ్యర్థ్థితో సర్పంచిగా నామినేషన్‌ వేయించారు. ఎన్నికల ఖర్చంతా ఆయనే పెట్టుకోడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ఓ వార్డుకు సభ్యుడిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. పోలింగ్‌ పూర్తయ్యాక అంతా కలిసి ఈయన్నే ఉప సర్పంచిగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఇక్కడ తెదేపా నాయకులు సైతం ఓ మహిళను రంగంలోకి దింపుతున్నారు. ఈమెకు సంబంధించిన ఎన్నికల ఖర్చు స్థానిక నాయకులు కొందరు భరించాలని నిర్ణయించారు.

రౌతులపూడి పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వేషన్‌ ఖరారైంది. దీంతో ప్రధాన పార్టీల నుంచి సర్పంచి పదవి ఎప్పట్నుంచో ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. దీంతో ఉపసర్పంచి పీఠానికి పోటీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వైకాపా, తెదేపా నుంచి ఇద్దరేసి చొప్పున నాయకులు ఉప సర్పంచి పదవిపై దృష్టి పెట్టారు. వార్డుల్లో గెలిస్తేనే ఉపసర్పంచి రేసులో నిలిచే అవకాశం ఉండటంతో ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమై పావులు కదుపుతున్నారు.

సామర్లకోట మండలంలోని పెదబ్రహ్మదేవం, జి.మేడపాడు, ఉండూరు, వీకేరాయపురం, వేట్లపాలెం పంచాయతీల్లో నాయకులకు పట్టున్నచోట ఇతర రిజర్వేషన్లు ఖరారు కావడంతో డైలమాలో పడ్డారు. దీంతో కొందరు నేరుగా వార్డు స్థానాలకు పోటీకి దిగుతుంటే.. ఇంకొందరు వారి అనుయాయులను ఈ రెరడు స్థానాలకూ బరిలోకి దింపుతున్నారు. మొత్తం మీద విజయమే లక్ష్యంగా కదులుతున్నారు.

కిర్లంపూడి మండలంలోని జగపతినగరం పంచాయతీ సర్పంచి స్థానం ఎస్సీ మహిళకు రిజర్వేషన్‌ అయింది. దీంతో గతంలో సర్పంచిగా పని చేసిన అధికార పార్టీకి చెందిన వ్యక్తి పోటీచేసే అవకాశం లేకపోయింది. తాజాగా ఈయన వార్డు సభ్యునిగా నామినేషన్‌ వేశారు. ఉప సర్పంచి పదవి కోసం పావులు కదుపుతున్నారు.

పక్కా వ్యూహంతో..

రిజర్వేషన్ల తారుమారుతో సర్పంచి పీఠం ఆశించి నిరాశకు గురైనవారు ఎలాగైనా పాలనపై పట్టు సాధించే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. వాస్తవంగా పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల ఫలితాల అనంతరం ఉప సర్పంచిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. సర్పంచిగా ఎలాగూ అవకాశం లేదు. ఉపసర్పంచిగా ఎన్నికై పంచాయతీ పాలనలో పైచేయి సాధించాలంటే ఉప సర్పంచిగా ఎన్నికవ్వాలి.. ఏదో ఒక వార్డు నుంచి పోటీచేసి గెలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకే పీఠంపై కన్నేసి భంగపడిన నాయకులు ఇప్పుడు వార్డు సభ్యులుగా పోటీచేస్తున్నారు. సర్పంచితోపాటు.. అందరు వార్డు సభ్యులను గెలిపించుకునే బాధ్యతను తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:పంచాయతీ ఆశావహులు: అన్నా.. ఒక్కఛాన్స్‌.. ఎప్పట్నుంచో పార్టీని నమ్ముకున్నా..!

ABOUT THE AUTHOR

...view details