గత నెలలో కురిసిన వానలకు తూర్పు గోదావరి జిల్లాలో పంట నీట మునిగి, నేలకు ఒరిగింది. పూర్తిగా నేలనంటిన పొలాలు అలాగే ఉండిపోవటంతో గింజల నుంచి మొలకలు వచ్చి పంటచేలు పచ్చగా మారాయి. యంత్రాల ద్వారా కోసేందుకు అనుకూలంగా లేకపోవటంతో కూలీలతో పనులు చేయిస్తున్నారు. ఇది రైతులకు అదనపు భారం అవుతోంది. ఎంతో కష్టపడి ధాన్యాన్ని గట్టుకు చేర్చినా.. రంగు మారిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం, వ్యాపారులు ముందుకు రావటం లేదు.
జిల్లాలోని తాళ్ళరేవు, ఐ పోలవరం, ముమ్మడివరం, కాట్రేనికోన మండలాలలో 90% పంట నష్టం జరిగింది. ఆ ప్రాంతాల్లో ఎక్కువగా కౌలు రైతులు సాగు చేస్తారు. పంట నష్టానికి సంబంధించిన వివరాలు సర్కారు నమోదు చేసుకున్నా.. పరిహారం మాత్రం భూ యజమానికే దక్కింది. ఫలితంగా.. కౌలు రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వారికి పంట రుణాలు ఇవ్వకపోవటం, తడిసిన ధాన్యాన్ని కొనకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.