ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"మా కుమార్తెను దారుణంగా చంపేశారు..న్యాయం చేయండి" - తూర్పుగోదావరి జిల్లాలో బాలిక మృతి

ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం తమకు న్యాయం చేయాలంటూ సీఎం జగన్​కు విన్నవించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ 12 ఏళ్ల కూతురు కామాంధుల చేతిలో బలైపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక మృతి చెంది ఏడాది గడిచినా తమ బాధను పట్టించుకునేవారు లేరని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

న్యాయం చేయండి

By

Published : Oct 29, 2019, 12:36 AM IST

Updated : Oct 29, 2019, 3:31 AM IST

న్యాయం చేయండి

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన ఓ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. కూలీ పనులు చేసుకునే వీరు తమ పిల్లలను ఉన్నతంగా చదివించాలనుకున్నారు. ఓ వ్యక్తి సలహాతో అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చదువు మాన్పించి ఇద్దరు కూతుళ్లు సహా కుమారుడిని తూర్పు గోదావరి జిల్లాలోని ఓ హైస్కూల్​లో చేర్పించారు. ఇక్కడే వసతి గృహంలో ఉంచి కష్టపడి తాము సంపాదించిన సొమ్ముతో ఫీజులు చెల్లించారు. అయితే చిన్నకూతురు(12)కు బాగోలేదంటూ ఓ రోజు పాఠశాల నుంచి వీరికి ఫోన్ వచ్చింది. బాలిక తండ్రి అక్కడ నుంచి వచ్చి చూసేసరికి ఆసుపత్రిలో విగత జీవిగా పడి ఉంది.

క్యాన్సర్ అని చెప్పి...

కాన్సర్ కారణంగా బాలిక చనిపోయిందని బాధిత కుటుంబానికి పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారు. కొంత డబ్బు ముట్టజెప్పి పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు చేయించేశారని తెలిపారు. ప్రిన్సిపల్ కామ వాంఛకు తమ కూతురు బలైందని పాఠశాల సిబ్బంది ద్వారా తెలుసుకున్నామని మృతురాలి తల్లి చెబుతోంది. బాలికను పాఠశాల నుంచి ఇంటికి పిలిపించుకుని 2018 జూలై 6న రాత్రి అత్యాచారం చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేయాలని తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులకు ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శవాన్ని తవ్వితీసి పోస్టుమార్టం నిర్వహించంగా బాలిక మరణానికి కాన్సర్ కారణం కాదని తేలినట్లు బాధిత కుటుంబం తెలిపింది. పాఠశాల ప్రిన్సిపల్ తనపైనా.. లైంగిక వేధింపులు చేశారని.... ఇంట్లో పనిచేసేందుకు పిలిపించుకుని చెడు వీడియోలు చూపించే వారని మృతురాలి సోదరి తెలిపింది.

స్పందనలో ఫిర్యాదు

తమ కూతురు మరణంపై విచారణ జరపాలని స్పందన కార్యక్రమంలో ఈ ఏడాది జూలై 15న ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి.. తగు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ కార్యాలయాన్ని కోరారు. అయితే విచారణ నిష్పాక్షికంగా జరగటం లేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. తమ కడుపుకోతకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సీఎం కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమంలో దరఖాస్తు చేశారు. వెంటనే ప్రిన్సిపల్​ను విధుల నుంచి తప్పించి విద్యార్థినులకు రక్షణ కల్పించాలని విన్నవించారు.

Last Updated : Oct 29, 2019, 3:31 AM IST

ABOUT THE AUTHOR

...view details