ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

LANDS: ఆలయాల ఆస్తుల జాబితాలో ఇతరుల భూములు..ఆందోళనలో యజమానులు - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

ఆలయ భూములలో సామాన్యుల స్థలాలను చేర్చటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ సర్వే నంబరు బదులు వేరే నంబరు పేర్కొనడం, ఆలయానికి ఓ సర్వే నంబరులోని కొంత భూమి ఉన్నా, దాన్ని సబ్‌డివిజన్‌ పేర్కొనకపోవడం.. వంటి లోపాల కారణంగా భూ యజమానాలు తమ స్థలాన్ని విక్రయించలేకపోతున్నారు.

Land issues
భూసమస్యలు

By

Published : Aug 12, 2021, 10:14 AM IST

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రు సర్వేనంబరు 213లో 1 నుంచి 6 సబ్‌డివిజన్ల వరకు 6.92 ఎకరాలు ఉంది. ఇందులో 1 నుంచి 4వ సబ్‌ డివిజన్‌ వరకు 5.36 ఎకరాలు వేర్వేరు వ్యక్తుల పేరిట ఉంది. సబ్‌డివిజన్‌ 5, 6 కలిపి 1.63 ఎకరాలు అన్నవరం దేవస్థానం పరిధిలో ఉండే విద్యార్థిని సత్రం పేరిట ఉంది. అయితే అధికారులు ఆస్తుల జాబితాలో సర్వే నంబరు 213లో 1.63 ఎకరాలని రిజిస్ట్రేషన్‌ శాఖకు పంపారు. మిగిలిన నాలుగు సబ్‌డివిజన్ల ప్రస్తావన లేకపోవడంతో ఆ భూముల క్రయ, విక్రయాలకు బ్రేకు పడింది.

* రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని టీఎస్‌ నంబరు 51, వార్డు నంబరు 4, బ్లాక్‌ 3లో కోటిలింగాలపేటలో ఉమాకోటిలింగేశ్వరస్వామి, సీతరామస్వామి ఆలయాలకు కలిపి 4.18 ఎకరాలు ఉంది. మంగళవారపుపేటలో టీఎస్‌ నంబరు 51, వార్డు నంబరు 6, బ్లాక్‌ 1లో ఓ వ్యక్తికి వారసత్వ భూమి ఉంది. అధికారులు టీఎస్‌ నంబరు 51లో ఉమాకోటిలింగేశ్వరస్వామి, సీతారామస్వామి ఆలయాల భూములుగా పేర్కొన్నారు. దీంతో టీఎస్‌ నంబరుతో ఇతర వార్డులు, బ్లాకుల్లోని భూముల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.

ప్రతి జిల్లాలో పెద్దసంఖ్యలో యజమానులు.. తమ భూములు వివిధ ఆలయాల జాబితాలో చేరడంతో ఇబ్బందుల పాలవుతున్నారు. దేవాలయ భూముల పరిరక్షణ కోసం వాటి ఆస్తుల జాబితాను గతంలో సిద్ధం చేసి, వివరాలను రిజిస్ట్రేషన్‌ శాఖకు పంపారు. దీంతో ఆ సర్వే నంబర్లలో ఎవరూ క్రయ, విక్రయాలు చేయకుండా చూడగలిగారు. ఇదే సమయంలో కొన్ని జిల్లాల్లో ఓ సర్వే నంబరు బదులు వేరే నంబరు పేర్కొనడం, ఆలయానికి ఓ సర్వే నంబరులోని కొంత భూమి ఉన్నా, దాన్ని సబ్‌డివిజన్‌ పేర్కొనకపోవడం, క్లరికల్‌ తప్పులు, రికార్డులు పరిశీలించకుండా నమోదు చేయడం.. తదితర కారణాలతో ఇతరుల భూములూ ఆలయ భూముల కింద నమోదయ్యాయి. దీంతో వాటి యజమానులు అవస్థలు పడుతున్నారు.

అరకొరగానే పరిష్కారం..

ఆస్తుల జాబితాలో ఉన్న ఇతర భూములు తొలగించాలంటూ గతంలో దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శులు.. అందరు ఈవోలు, సహాయ కమిషనర్లను గతంలో ఆదేశించారు. అయినా ఇంకా చాలా ఆస్తులను తొలగించలేదు. భూ యజమాని.. తన రికార్డులు, ఆధారాలను ఆలయ ఈవోకు ఇస్తే, జిల్లా సహాయ కమిషనర్‌ ద్వారా, కమిషనరేట్‌కు ఫైల్‌ వెళ్తుంది. అక్కడ పరిశీలించి స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ కార్యాలయానికి పంపుతారు. చివరగా జిల్లా సబ్‌రిజిస్ట్రార్‌కు ఆ వివరాలు వెళితే, అక్కడ 22-ఎ1 (సి) జాబితా నుంచి ఆ భూములను తొలగిస్తారు. ఇలాంటి చాలా దరఖాస్తులు ఈవోల వద్ద, జిల్లా సహాయ కమిషనర్‌ వద్దనే పెండింగ్‌లో ఉన్నాయి. కమిషనర్‌ కార్యాలయానికి వచ్చి, ముందుకు కదలనివి వందల్లో ఉన్నాయి. వివరాలు పరిశీలించేందుకు సమయం పడుతుందని, అందుకే జాప్యం జరుగుతోందని దేవాదాయశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ..GSLV: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 ప్రయోగం విఫలం.. క్రయోజనిక్ దశలో సాంకేతిక సమస్య

ABOUT THE AUTHOR

...view details