కరోనా కారణంగా దెబ్బతిన్న వాటిల్లో విద్యారంగం ఒకటి. ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలు ఆశ్రయిస్తున్న ఏకైక మార్గం ఆన్‌లైన్ బోధన. గతేడాదే ఈ విధానానికి నాంది పలికినా తరగతులు పూర్తిస్థాయిలో సాగలేదు. గ్రామాల్లో విద్యార్థులకు అంతర్జాల సౌకర్యం లేకపోవడం, సిగ్నల్ సమస్యలు, విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఇలా పలు సమస్యలతో తరగతి గదుల్లో మాదిరి పాఠాలు వినలేకపోయారు.
మనం ఏం చేశామంటే...
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ అందుబాటులో ఉన్న సాంకేతిక అంశాలు, వనరులు(అంతర్జాలంతో కూడిన స్మార్ట్ టీవీ, చరవాణి, కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్) వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ గూగుల్ ఫామ్ ద్వారా అభిప్రాయాలు సేకరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని విద్యార్థుల నుంచి పై వివరాలతో కూడిన సమాచారాన్ని తెలుసుకున్నారు. గతంలో పడిన అవస్థలను అధిగమించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆమ్మఒడి పథకంలో 8, 9, 10, ఇంటర్ తరగతుల్లో కావాల్సిన వారికి ల్యాప్‌టాప్‌లు ఇవ్వడానికి నిర్ణయించారు. అన్ని గ్రామాల్లోనూ ఫైబర్ నెట్‌ను ఉచితంగా అందించాలని భావిస్తున్నారు. దాతల సహకారంతో అవసరమైన విద్యార్థులకు ఆండ్రాయిడ్ చరవాణులు, ట్యాబ్‌లు కానీ అందించాలనే యోచన చేస్తున్నారు.
ఈ రాష్ట్రాలు స్ఫూర్తిబాట...
కేరళ: కరోనాతో కేరళలో బడులు నడవడం కష్టమైంది. అది గుర్తించిన ప్రభుత్వం విద్యార్థులందరికీ గత ఏడాది ట్యాబ్‌లు అందజేసి పాఠాలు బోధించింది. ఇందుకు దాతల సహకారం తీసుకుంది. పంపిణీ చేసిన ట్యాబ్‌పై విద్యార్థికి సంపూర్ణ అవగాహన కల్పించి, దాని ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పారు.
మహారాష్ట్ర: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు సర్కారు తరఫున ఇంటర్నెట్ కోసం రూ.500 అందివ్వాలని తాజాగా నిర్ణయించింది. ఇంటర్నెట్ బిల్లులు కట్టలేక చదువుకు దూరమవుతున్న సుమారు 40 వేలమంది పేద, మధ్యతరగతి పిల్లల కోసం ఈ పథకం తెచ్చింది.