చెత్త పన్ను చెల్లించలేదని ఇటీవల కర్నూలు నగరంలోని దుకాణాల ముందు పారిశుద్ధ్య సిబ్బంది చెత్త పోసిన విషయం మరువకముందే తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి పన్ను, కుళాయి పన్ను, చెత్త పన్ను చెల్లించలేదని మున్సిపల్ అధికారులు రెండు ఇళ్లకు తాళాలు వేశారు. స్థానిక 15వ వార్డు మోహన్‌నగర్‌లోని గొర్ల సత్తిబాబు, గొర్ల రమణ ఇళ్లకు నిన్న సాయంత్రం మున్సిపల్ సిబ్బంది తాళంతో పాటు సీల్‌వేశారు. ఒక ఇంట్లో మహిళలు ఉన్నా పట్టించుకోకుండా వారిని ఇంట్లోనే ఉంచి తాళం వేశారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా సానుభూతి పరుల ఇళ్లకు మాత్రమే తాళాలు..
సీల్ వేసిన రెండు ఇళ్లను మాజీ ఎమ్మెల్యే, తెదేపా అధికార ప్రతినిధి వర్మ ఆదివారం రోజు పరిశీలించారు. మున్సిపల్ అధికారుల తీరుపై వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఇళ్లకు మాత్రమే తాళాలు వేశారని మండిపడ్డారు. మోహన్ నగర్‌లో చాలా మంది వైకాపా శ్రేణుల ఇళ్లకు రూ.లక్షల్లో పన్ను బకాయిలు ఉన్నా ఎందుకు వారి జోలికి వెళ్లలేదని నిలదీశారు. ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వని పిఠాపురం పురపాలక సంఘం అధికారులు... ప్రజలపై పన్నుల భారం వేయడమేంటని నిలదీశారు. రాత్రి 11గంటలకు వాలంటీర్లు ఇళ్ల వద్దకు తలుపులు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరుమారకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. స్థానికులు, తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగడంతో గొర్ల సత్తిబాబు ఇంటికి వేసిన తాళం, సీల్‌ను సిబ్బంది తొలగించారు. రమణ ఇంటికి మాత్రం నిన్న సాయంత్రం నుంచి తాళం, సీల్ అలాగే ఉంచారు. ప్రస్తుతం ఈ అంశం పిఠాపురంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పన్ను బకాయిలు చెల్లించని వారి ఆస్తులు జప్తు చేస్తామంటూ ఇటీవల కాకినాడ కార్పొరేషన్ అధికారులు రెండు వాహనాలకు ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. దీంతో అధికారులు ఆ వాహనాలకు కట్టిన ప్లెక్సీలు తొలగించారు.
ఇదీ చదవండి
మాంసం ముక్కల గొడవ.. ఓ నిండు ప్రాణం బలి !