ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధిక దిగుబడి... అయినా రైతు గుండెల్లో అలజడి! - farming

సాగులో అధిక దిగుబడి వచ్చినా రైతుల కళ్లల్లో ఆనందం మాత్రం మిగలడం లేదు. గిట్టుబాటు ధరలు లేక పెట్టుబడి కంటే తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ఇందుకు తోడు ఫొని తుపాను ఎక్కడ తమపై ప్రభావం చూపుతుందోనన్న భయంతో తక్కువ ధరకే మిల్లర్లకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.

రైతు కష్టాలు

By

Published : May 2, 2019, 9:47 PM IST

అన్నదాతల ఆవేదన
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల్లోని సుమారు 15 వేల ఎకరాలలో వరిని రైతులు సాగు చేశారు. ప్రస్తుతం అందరూ కోతలు... పంట నూర్పిడి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను.. రైతులను కలవరపెడుతోంది. కొన్ని నెలలుగా వాతావరణ పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నందున.. పంట దిగుబడి బాగా వచ్చింది. ఈ ఆనందం రైతుల కళ్లలో కనిపించడం లేదు.

తుఫాను భయంతో చేతికొచ్చిన పంట చేజారిపోతుందనే భయంతో తొందరగా ధాన్యం గట్టెక్కిస్తున్నారు. తడిస్తే అమ్ముడుపోదన్న ఆవేదనతో ముందే విక్రయించాలని చూస్తున్నారు. యంత్రాల ద్వారా కోత కోసినందున.. ఆ ధాన్యాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయడానికి కొర్రీలు పెడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు ధర ఎలాగూ లేదనీ.. కనీసం తమ దగ్గర ఉన్న ధాన్యం నిల్వ ఉంచుకొనే మార్గమైనా ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతుల వద్ద నేరుగా సేకరించాల్సి ఉన్నా.. తమ దగ్గరకు వచ్చిన ధాన్యాన్ని రకరకాల సాకులతో తిరిగి పంపించేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారు మండలానికి 3 చొప్పున 15 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా... వాటి వివరాలు తమకు తెలియదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details